Lavanya Father : ఇలా జరుగుతుందని అనుకోలేదు: లావణ్య తండ్రి ఫైర్

Lavanya Father

Raj Tarun

Lavanya Father : ప్రేమ‌, పెళ్లి పేరుతో హీరో రాజ్ త‌రుణ్ తనను మోసం చేశాడ‌ని లావ‌ణ్య అనే యువతి పోలీసులను ఆశ్రియంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజ్ త‌రుణ్ తో పాటు హీరోయిన్ మాల్వి మల్హో్త్ర, ఆమె సోదరుడిపై కేసు నమోదు కాగా, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్ర ఫిర్యాదుపై  లావణ్యపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.  మాల్వీ మల్హోత్ర కారణంగా తనను దూరం పెడతున్నాడని లావణ్య ఆరోపిస్తున్నది. తామిద్దరం 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని ఒకసారి, పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. రెండు రోజుల క్రితం మరో బాంబు పేల్చింది. 2104లో తనకు అబార్షన్ కూడా చేయించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన మెడికల్ ఆధారాలను తన ఫిర్యాదుకు జత చేసినట్లు చెప్పింది.

దీంతో రాజ్ తరుణ్   రోజు రోజుకూ ఈ కేసులో కూరుకుపోతున్నట్లే కనిపిస్తున్నది. లావ‌ణ్య ఒక్కో ఆధారాన్ని పోలీసుల‌కు అప్పగిస్తున్న తీరును చూస్తుంటే రాజ్ త‌రుణ్ చుట్టూ బ‌ల‌మైన ఉచ్చు బిగుస్తున్నట్లే  అర్ధమ‌వుతున్నది. త‌న‌ని ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకొని, 11 ఏళ్లు కాపురం చేశాడని, ఇప్పుడు త‌ప్పించుకొని తిరుగుతున్నాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన లావ‌ణ్య  మాల్వీ మ‌ల్హోత్రా పేరు కూడా అందులో చేర్చింది. ఈ హీరోయిన్‌తో రాజ్ త‌రుణ్‌ కు ఎఫైర్ ఉందని, అందుకే త‌న‌ని దూరం పెడుతున్నాడని ఆరోపించింది. అంతేకాదు.. రాజ్ త‌రుణ్ కు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయ‌ని మరో బాంబు పేల్చింది. ఇప్పుడు అబార్షన్ వ్యవ‌హారం కూడా తెర‌పైకి రావడంతో  రాజ్ త‌రుణ్ ఈ కేసులో నుంచి బయటపడేది కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కేసులోకి క‌ల్యాణ్ దిలీప్ సుంక‌ర రావ‌డంతో వివాదం మరింత ముదిరింది. పెద్ద మ‌నుషుల‌తో కూర్చుని మాట్లాడుకోవాల‌ని, కోర్టుకు వెళ్లితే గ‌నుక రాజ్ త‌రుణ్ ఇరుక్కుపోతాడని, అహం వీడి చేసిన త‌ప్పుల్ని ఒప్పుకొని, లావ‌ణ్యని భార్యగా ఒప్పుకోవాల‌ని ఓ వైపు దిలీప్ సుంక‌ర హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు.. లావ‌ణ్య – రాజ్ త‌రుణ్‌ కు   పెళ్లయ్యింద‌ని, ఇద్దరూ కల‌సి కాపురం చేశారు అన‌డానికి ఇండ‌స్ట్రీలోని కొంత‌మంది హీరోలే సాక్ష్యమని, ఒక‌వేళ రాజ్ త‌రుణ్ గ‌నుక ముద్దాయిగా కోర్టులో నిల‌బ‌డితే, అప్పట్లో రాజ్‌త‌రుణ్‌, లావ‌ణ్యలకు స‌పోర్ట్ చేసిన‌ వాళ్లు కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంద‌ని ప‌రోక్షంగా హెచ్చరించాడు.

లావణ్య – రాజ్ తరుణ్ రోజు రోజుకూ ముదురుతున్న సందర్భంలో లావణ్య తండ్రి స్పందించాడు. తనపై కూతురిపై అనవసరంగా నిందలు వేయొద్దంటున్నాడు. రాజ్ తరుణ్ తిరిగొచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ వ్యవహరిస్తున్న తీరుపై లావణ్య తండ్రి మండిపడుతున్నారు. కరోనా సమయంలో రాజ్ తరుణ్ కు డబ్బులు కూడా ఇచ్చామని చెప్పారు. అల్లుడిగా భావించానని, కానీ తన కూతురిపైనే నిందలు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురుకు డ్రగ్స్, ఇతర ఏ దురలవాట్లు లేవని, అక్రమ సంబంధాలు కట్టుకథ  అని, ఇలా జరుగుతుందని తాము ఊహించలేదన్నారు.

TAGS