AP Cultivation : ఏపీ సేద్యానికి అంతర్జాతీయ గుల్బెంకియన్ అవార్డు

AP Cultivation

AP Cultivation

AP Cultivation : ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ‘గుల్బెంకియన్ అవార్డు’ ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఒక శాస్త్రవేత్త, మరో సంస్థతో కలిసి ఏపీసీఎన్ఎఫ్ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. పోర్చుగల్ లోని లిస్బన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి.విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ నెట్టం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థకు అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే ఒక మిలియన్ యూరోల నగదు బహుమతిని ముగ్గురు విజేతలకు సమానంగా పంచనున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి ఈ అవార్డు దక్కించుకుంది.

2016లో ఏపీ ప్రభుత్వం ఏపీసీఎన్ఎఫ్ ప్రొగ్రామ్ ను ప్రారంభించింది. దీనికింద సన్నకారు రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సహజ పద్ధతుల్లో సేద్యం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. సేంద్రియ విధానంలో తయారు చేసిన ఎరువును ఉపయోగించడం, దేశీయ విత్తనాలు తిరిగి ప్రవేశపెట్టడం, పంటల వైవిద్యీకరణ, నేల సారాన్ని కాపాడుతూ సాగు చేయడం వంటి వాటిని ఇది ప్రోత్సహిస్తోంది.

గుల్బెంకియన్ ఫౌండేషన్ ను 2020లో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డులు అందిస్తున్నారు.

TAGS