Number Plates : ఇక ‘తాలూకా’లు జాన్ తా నై.. నెంబర్ ప్లేట్లు ఉండాల్సిందే..

Number Plates : తాలూకా అంటే అదేదో ప్రాంతం కాదండోయ్.. ‘వారి తరుఫు’ అన్నట్లు ఈ పదం ఇప్పుడు ఎక్కువగా వెహికిల్ నెంబర్ ప్లేట్లపై కనిపిస్తుంది. నేను ‘ఫలానా వారి తాలూకా.. నాకు ఫలానా వారు తెలుసు..’ అంటూ చిత్ర విచిత్రమైన స్టిక్కర్లను నెంబర్ ప్లేట్ల స్థానంలో వేయిస్తున్నారు. నెంబర్ ప్లేట్ కాకుండా బండిపై ఎక్కడ పడితే అక్కడ రాయించుకుంటే పరవా లేదు. కానీ నెంబర్ తీసేసి మరీ ఆ ప్రాంతంలో స్టిక్కర్లు వేయించుకోవడం మంచి పద్దతి కాదు కదా..

దీనిపై పోలీసులు ఎప్పటి కప్పుడు సీరియస్ అవుతున్నా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల పిఠాపురంలో ఒక యువకుడు నెంబర్ ప్లేట్ ను బండి డిక్కీలో పెట్టి.. ‘ఎమ్మెల్యే తాలూకా’ అనే స్టిక్కర్ ను నెంబర్ ప్లేట్ ప్లేస్ లో రాయించాడు. ఆ బండిని పట్టుకున్న పోలీసులు యువకుడికి బుద్ధి చెప్పారు. పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే అందరివాడని అందరం ఆయన తరఫు వాళ్లమే అని ఇలా బండ్లపై నెంబర్ ప్లేట్లు ఉండే స్థానంలో స్టిక్కర్లు వేయించవద్దని సూచించారు.

బండిపై నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్తే.. ఎలా పట్టుకుంటామని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజీలో వాహనం నెంబరు కనపడదని, తనిఖీల్లో కూడా నెంబర్ కనిపించకపోతే వదిలేస్తారని ఇలాంటి స్టిక్కర్ల వల్ల పోలీసులకు కాదు.. మీకే తీవ్రమైన నష్టం అని వివరించారు.

నెంబర్ ప్లేట్ తో పాటు హెల్మెట్..
నెంబర్ ప్లేట్ ప్లేస్ లో ఉన్న స్టిక్కర్ ను ఆ ఓనర్ తోనే తొలగించిన పోలీసులు నెంబర్ ప్లేట్ ను ఫిట్ చేయించారు. పైగా ఆయనకు హెల్మెట్ లేకపోవడం, త్రిపుల్ రైడింగ్ చేస్తుండడంతో హెల్మెట్ కొనిపించారు. త్రిపుల్ రైడింగ్ మంచిది కాదని కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేశారు.

తాలుకా ట్రెండ్ పిఠాపురానికే పరిమితం కాలేదు.. విజయవాడలో కూడా చాలా మంది యువత ఇలానే స్టిక్కర్లు వేసుకున్నారు. వీడియోలో కనిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ది కూడా పిఠాపురం అట. మాదీ పిఠాపురమే, మరి మేం వేసుకున్నామా? అని యువకుడిని ప్రశ్నించడం కొసమెరుపు.

TAGS