Indian : ఏంటి భారతీయుడు రాజశేఖర్, వెంకటేష్ లతో తీయాలనుకున్నాడా శంకర్?
Indian Movie : తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్ డేట్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. ఇక సినిమా విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
నిజానికి భారతీయ సినీ చరిత్రలోనే గుర్తించుకోదగిన చిత్రాల్లో భారతీయుడు ఒకటి. ఈ చిత్రం 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సమయానికి సౌత్ ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. వసూళ్లు పరంగా కూడా సినిమా బడ్జెట్ కు తగినట్లే వచ్చాయి. తెలుగులో భారతీయుడు, హిందీలో హిందుస్థాని పేరుతో అనువాదమై రెండు చోట్లా భారీ హిట్ కొట్టింది. ఇన్నాళ్లకు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
ఐతే ‘ఇండియన్’ సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ తప్ప సేనాపతి పాత్రకు ఇంకెవ్వరూ న్యాయం చేయలేరని అనిపిస్తుంది. కొడుకు పాత్రలోనూ ఆయన అంత కన్విన్సింగ్‌గా నటించారు. కానీ వాస్తవానికి ఈ సినిమాలో కమల్ నటించాల్సింది కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ కథ రాసుకున్నాడు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కమల్‌ను సంప్రదించారు. ఆయన ఓకే అనడంతో సినిమా షురూ అయింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. కమల్ కూడా ఒప్పుకోకుంటే శంకర్ తెలుగు స్టార్లయిన రాజశేఖర్, వెంకటేష్‌లతో ఈ సినిమా తీయాలని భావించాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి శంకర్ అసిస్టెంట్ అయిన వసంత బాలన్ వెల్లడించాడు. కమల్ కూడా ఒప్పుకోని పక్షంలో రాజశేఖర్‌తో సేనాపతి పాత్ర చేయించి.. కొడుకు పాత్రను వెంకటేష్‌కు ఇవ్వాలని అనుకున్నాడట. ఐతే కమల్‌కు ‘ఇండియన్’ కథ తెగ నచ్చేసి తండ్రీకొడుకులిద్దరి పాత్రలు తనే చేయడానికి ముందుకొచ్చాడు. నిజానికి సేనాపతి-చందు పాత్రలకు రాజశేఖర్, వెంకటేష్ న్యాయం చేయగలిగేవారా అన్న సందేహం ఇప్పుడు కలుగుతుంది.