Volodymyr Zelenskyy : పుతీన్, మోదీ ఆలింగనం.. తీవ్రంగా స్పందించిన జెలెన్ స్కీ
Volodymyr Zelenskyy : రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ సమావేశం కావడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత పీఎం నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆతిథ్యమిచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్ తో మోదీ భేటీ తమను నిరాశపర్చిందన్నారు.
రష్యాలో మోదీ పర్యటన సమయంలోనే ఉక్రెయిన్ పై మాస్కో క్షిపణుల వర్షం కురిపించింది. ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. అందులో అనేక అపార్ట్ మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు కూలిపోయాయని జెలెన్ స్కీ తెలిపారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడితో సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ తో యుద్ధం అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘‘దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవు. చర్చలు, దౌత్మే ముందుకెళ్లే మార్గాలు’’ అని పీఎం మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.