KCR : పాపం కేసీఆర్ ఎంతగా రగిలిపోతున్నారో?
KCR : కేసీఆర్..ఈ పేరు ఒకప్పుడు తెలంగాణ బ్రాండ్. తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ. ఇది అక్షరాల వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో దశాబ్దంన్నర పాటు తన వ్యూహాలతో ముందుకు నడిపించారు. విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాలు, సబ్బండ వర్గాల ప్రజల సంపూర్ణమద్దతుతో వారితో కలిసి ఆయన చేసిన పోరాటానికి కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చింది. బీజేపీ సపోర్ట్ చేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ వ్యతిరేకులు ఎన్ని మాట్లాడినా..తెలంగాణలో ఉండే ప్రతీ మనిషి భావన ఇదే.
అయితే కేసీఆర్ ప్రజల్లో గుండెల్లో ఉన్న తన హోదాను పూర్తిగా విస్మరించారు. పదేండ్లు పాలన చేసి అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రగామిగా ముందుకు నడిపించినా ఆయన చేసిన కొన్ని తప్పులతో బీఆర్ఎస్ అధోగతి పాలైంది. రాజకీయ శత్రువులపై ఆయన అనుసరించిన తీరు, కుటుంబ పాలన, అవినీతి, పార్టీ నేతల అవినీతి, కబ్జాలు..ఇలా ఎన్నో కారణాలు..ఆ పార్టీ పుట్టి ముంచాయి. తాను ఎంతో ద్వేషించే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. వీరిద్దరూ కలిసి విభజన సమస్యలపై ‘తన తెలంగాణ’లో చర్చించుకోవడం చూసి ఆయన ఎంతగా రగిలిపోతున్నాడో..
వాస్తు, జాతకాలను బలంగా నమ్మే కేసీఆర్ రూ.4-500 కోట్లు ఖర్చు చేసి వాస్తు ప్రకారం ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు ఉపయోగించుకున్న పాత సచివాలయంలో వాస్తు దోషాలు ఉన్నాయంటూ దానిలో అడుగుపెట్టకుండా ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగించారు. తెలంగాణ రాజకీయాలను ప్రగతి భవన్ నుంచే శాశించారు. దేశ రాజకీయాలను కూడా అక్కడి నుంచే శాశించాలని అనుకున్నారు. కానీ సొంత రాష్ట్రంలోనే ఓడిపోవడంతో ప్రగతి భవన్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోక తప్పలేదు. అదే భవనంలో నిన్న
రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
ఆయన దృష్టిలో వారివురూ చిల్లర రాజకీయ నాయకులు. అటువంటివారు తాను ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజా భవన్)లో అధికారికంగా సమావేశమవ్వడం చూసి పాపం కేసీఆర్ లోలోన ఎంతగా ఆక్రోశిస్తుంటారో? ముఖ్యంగా తన రాజకీయ శత్రువులిద్దరూ తన అనుమతి, ప్రమేయం లేకుండానే విభజన అంశాలపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే కేసీఆర్ ఎంతగా రగిలిపోతారో ఊహించుకోవచ్చు. అయితే సమావేశం ముగిసినా నిర్ణయాలు లేకపోవడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటి వరకూ స్పందించలేదు. విభజన సమస్యలపై రేవంత్ రెడ్డి ఏ మాత్రం అటు ఇటు చేసినా అది బీఆర్ఎస్ కు పెద్ద అస్త్రమే అవుతుందనడంలో డౌటే లేదు.