Chandrababu – Revanth : సామరస్యంగానే సమస్యల పరిష్కారం.. ఇద్దరూ సీఎంల అభిప్రాయమిదే..

Chandrababu - Revanth

CM Chandrababu – CM Revanth

Chandrababu – Revanth : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్‌ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురు అధికారులతో ఒక కమిటీ, రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారమవని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో ప్రజాభవన్‌ సందడిగా మారింది. భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా.. చంద్రబాబు ఏపీ మంత్రులు, అధికారులను పరిచయం చేశారు. అనంతరం దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. త్వరలోనే సీఎస్‌లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటుంది. అక్కడ కూడా పరిష్కారమవని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ రెండంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అధికారులు, మంత్రుల కమిటీల్లో తేలని అంశాలను ఇరు రాష్ట్రాల సీఎంల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలని అంగీకారానికి వచ్చారు. అలాగే మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాలపై కలిసి యుద్ధం చేయాలని రేవంత్, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  

నిర్ణయించిన సమయానికి కంటే ముందే రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ఆయన సాయంత్రం 5.47 గంటలకు రాగా, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు రేవంత్‌ సాదర స్వాగతం పలికారు స్వాగతం పలికారు. భట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సైతం చంద్రబాబుకు బొకేలు అందించారు. పెండింగ్‌ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా సీఎంలు… అధికారుల సూచనలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు అంశాలవారీగా చొరవ తీసుకుని, న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.  అధికారులు తొలుత… విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశం, విద్యుత్‌ సంస్థల బకాయిలు, 15 ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి, ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.  

ఏపీలో కలిపిన ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ… ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని, ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చర్చ సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులు కోరారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి నిరాకరించినట్లు తెలిసింది.

TAGS