T20 Retirement : టీ20ల్లో రిటైర్మెంట్ బాటలో మరో ముగ్గురు సీనియర్లు
T20 Retirement : టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం అనంతరం టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు వెటరన్ ఆటగాళ్లు టీ20కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఉన్న విషయం తెలిసిందే. ఇక మరో ముగ్గు కూడా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రవిచంద్రన్ అశ్విన్..
టీమిండియా వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరపున టెస్టు ఫార్మాట్లో అన్ని టోర్నమెంట్లకు ఎంపికవుతున్నాడు. ఈ 37 ఏళ్ల ప్లేయర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడే అవకాశాలు చాలా తక్కువ. రవిచంద్రన్ అశ్విన్ చివరిసారిగా 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్‌లో ఆడాడు. అప్పటి నుంచి అతనికి భారత టీ20 జట్టులో మళ్లీ అవకాశం దక్కలేదు. అశ్విన్ తన కెరీర్లో ఇప్పటివరకు టీమిండియా తరపున 65 టీ20 మ్యాచ్‌ల్లో ఆడాడు. వీటిలో 72 వికెట్లు తీశాడు. అతను త్వరలో టీ20 ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
శ్రేయాస్ అయ్యర్ మళ్లీ ఎంపికయ్యేది డౌటే..
టీమిండియాలో అత్యంత సక్సెస్ ఫుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో శ్రేయాస్ అయ్యర్ కూడా ఒకరు. అయితే కొంతకాలంగా శ్రేయాస్ టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు కూడా అయ్యర్ ఎంపిక కాలేపోయాడు. 3 డిసెంబర్ 2023న ఆస్ట్రేలియాతో తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అయ్యర్ ఐపీఎల్ 2024లో బాగా రాణించాడు. కేకేఆర్ కు టైటిల్‌కు తీసుకువచ్చేలా జట్టను నడపించాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో శివమ్ దూబే, సంజు శాంసన్, రింకూ సింగ్ వంటి చాలా మంది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం టీమిండియా తరపున టీ20 లలో ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యర్న తిరిగి జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తున్నది.
కేఎల్ రాహుల్ కెరీర్ ముగిసినట్లే?
భారత జట్టులో అత్యంత సమర్థవంతమైన ప్లేయర్లలో కేఎల్ రాహుల్ ఒకరు. కానీ టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చాలా కాలంగా రాహుల్‌ను టీ20 జట్టుకు సెలెక్షన్ కమిటీ ఎంపికచేయడం లేదు. రాహుల్ చివరిసారిగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్లో ఆడాడు. ఈ మ్యాచ్ అనంతరం సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌కు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. రాహుల్‌ను నిరంతరం పక్కనపెడుతుండడంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో అతని కెరీర్ దాదాపు ముగిసినట్లేనని చర్చ జరుగుతున్నది.