ATM : వంద రూపాయల కోసం ఏటీఎంల ధ్వంసం
ATM : సిద్దిపేట జిల్లాలోని రామాయంపేటలో ఓ వ్యక్తి కేవలం రూ.100 కోసం ఏటీఎంను ధ్వంసం చేశాడు. తన అవసరానికి ఏటీఎంల నుంచి డబ్బులు రావడం లేదనే కోపంతో రాయితో ఏటీఎంను పగులగొట్టాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. స్థానిక ఎస్బీఐ బ్యాంకు పక్కనే ఏటీఎం ఉండగా, సిద్దిపేట చౌరస్తాలో మరో ప్రైవేటు ఏటీఎం ఉంది. కాగా, పట్టణానికి చెందిన సాదక్ అనే వ్యక్తికి రూ.100 అవసరం ఉండడంతో గురువారం రాత్రి సిద్దిపేట చౌరస్తాలోని ఏటీఎం వద్దకు వెళ్లాడు. నగదు రాకపోవడంతో ఏటీఎంను ధ్వంసం చేశాడు.
అక్కడి నుంచి ఎస్బీఐ ఏటీఎం వద్దకు వచ్చాడు. అక్కడా నగదు కోసం ప్రయత్నించి రాకపోవడంతో ఏటీఎంను రాయితో ధ్వంసం చేశాడు. మొదట గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించినట్లు శుక్రవారం ఫిర్యాదు అందగా ఎస్సై రంజిత్ విచారణ చేపట్టారు. బ్యాంకు సమీపంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పట్టణానికి చెందిన సాదక్ గా గుర్తించి కేసు నమోదు చేశారు.