Six MLCs join Congress : బీఆర్ఎస్ కు భారీ షాక్‌.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

Six MLCs join Congress

Six MLCs join Congress

Six MLCs join Congress : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ  ఆయనకు.. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్‌ విలవిలలాడిపోతోంది. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా, ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. వారు భాను ప్రసాద్‌, బస్వరాజ్ సారయ్య, దండె విఠల్‌, ఎం.ఎస్‌. ప్రభాకర్‌, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే.. అర్ధరాత్రి ఆయన నివాసంలో సమావేశమై వారంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. దండే విఠల్ -ఆదిలాబాద్ లోకల్ బాడీ, భాను ప్రసాద్ -కరీంనగర్ లోకల్ బాడీ, ఎమ్మెస్ ప్రభాకర్ -రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ.. బొగ్గవరపు దయానంద్- గవర్నర్ కోటా, ఎగ్గే మల్లేషం-ఎమ్మెల్యే కోటా, బస్వరాజ్ సారయ్య- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా  ఎన్నిక అయ్యారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రే వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది.

ఇటీవలే మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బీఆర్ఎస్‌‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరికొందరు కూడా కేసీఆర్ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మహబూబ్‌నగర్‌కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు తన నిర్ణయం ఉంటుందన్నారు. పార్టీ మార్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తలే నిర్ణయిస్తారని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

TAGS