NEET Exam : ‘నీట్ ను రద్దు చేయవద్దు’.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు

NEET Exam – Supreme court
NEET Exam : నీట్ పరీక్షను రద్దు చేయవద్దని 56 మంది నీట్ ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో తాజాగా 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్టీఏను ఆదేశించాలని కోరారు. నీట్ వ్యవహారంపై ఇప్పటి వరకు 26 పిటిషన్లు దాఖలు కాగా, వీటన్నింటినీ జులై 8న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.
పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా, కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం చేస్తుంది. విద్యాహక్కు ఉల్లంఘనకు దారితీస్తుంది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్టీఏకు ఆదేశాలివ్వాలని గుజరాత్ కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లాతో పాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.