Cricket Heroes : స్వదేశానికి క్రికెట్ హీరోలు! ఇక పండుగే పో

Cricket Heroes

Cricket Heroes

Cricket Heroes : టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు తుఫాన్ కారణంగా బార్బడోస్ లోని బ్రిడ్జిటౌన్ లో చిక్కుకుపోయింది. ఇటు జింబాబ్వే టూర్ ఉండడంతో ప్లేయర్స్ ను వెనక్కు తీసుకువచ్చేందుకు బీసీసీఐ ఆందోళన పడింది. దీంతో తుఫాన్ కొంచెం తగ్గుముఖం పట్టడంతో టీమ్ బుధవారం(జూలై 3) స్వదేశానికి బయల్దేరింది.

ఐసీసీ టీ20 కప్ ఫైనల్ ఆట ముగియగానే కరేబియన్ తుఫాన్ ప్రారంభమైంది. దీంతో టీమిండియా 3 రోజులుగా బార్బడోస్ రాజధాని బ్రిడ్జిటౌన్ లోనే చిక్కుకుంది. అమెరికాలోని ఫ్లారిడా మీదుగా స్వదేశానికి తిరుగు పయనమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు.

నాలుగో శ్రేణి తుఫాన్ అని హెచ్చరికలు జారీ చేయడంతో బ్రిడ్జిటౌన్ అంతర్జాతీయ (గ్రాంట్లే ఆడమ్స్) విమానాశ్రయాన్ని ఆ దేశ అధికారులు మూసి వేశారు. దీంతో ప్రపంచానికి ఈ ప్రాంతం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జేషా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్, క్రికెటర్ల కుటుంబ సభ్యులు 70 మంది బృందం హోటెల్ గదులకే పరిమితమైంది. స్వదేశానికి ఎప్పుడు వెళ్దామా అన్న భారత జట్టు సభ్యుల సహనానికి కరీబియన్ తుఫాన్ పరీక్ష పెట్టింది.

భారత బృందం కోసం ప్రత్యేక విమానం..
వాస్తవానికి.. చివరి ఆట ముగిసిన వెంటనే భారత జట్టు బార్బడోస్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ మీదుగా స్వదేశానికి తిరిగి రావాలి. కానీ తుఫాన్ వారి టూర్ ను అడ్డుకుంది. రెండు, మూడు రోజులుగా జట్టు హోటల్ గదులకే పరిమితమైంది. ఈ రోజు కొంచెం తగ్గుముకం పట్టడంతో టీమిండియా కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపించింది. ఈ విమాన సర్వీసుకు ‘ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్’ అని నామకరణం చేసింది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం బ్రిడ్జ్ టౌన్ విమానాశ్రయాన్ని తిరిగి తెరవడంతో మూడు రోజులుగా చిక్కుకుపోయిన భారత బృందం ఊపిరి తీసుకుంది. బ్రిడ్జ్ టౌన్ లో బయల్దేరిన విమానం అమెరికాలోని న్యూ జెర్సీ మీదుగా న్యూఢిల్లీకి తిరిగి రానుంది. 16 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటలకు జట్టు న్యూఢిల్లీ చేరుకుంటుంది.

ప్రధాని అభినందన
ప్రపంచ కప్ గెలిచిన భారతజట్టును గురువారం జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించనున్నారు. ఆ తర్వాత భారతజట్టు సభ్యులు, సహాయక బృందం న్యూఢిల్లీ నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లనుంది.

ప్రపంచకప్ సాధించిన భారతజట్టుకు రూ. 125 కోట్ల ప్రోత్సాహక నగదు బహుమతిగా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులోని మొత్తం 15 మంది సభ్యులకు తలో రూ. 5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లతో పాటు కోచింగ్, సహాయక బృంద సభ్యులకు తలో రూ. కోటి నజరానాగా ఇవ్వనున్నారు.

TAGS