Nitin Gadkari : విమానం లాంటి బస్సు.. 132 సీట్లతో త్వరలో రోడ్లపైకి
Nitin Gadkari : దేశంలో సరికొత్త బస్సులు రాబోతున్నాయి. ఆ బస్సుల్లో సీట్లు అక్షరాలా 132 సీట్లు ఉంటాయి. విమానం మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇది బస్సు. ఈ బస్సులో విమానంలో ఉన్నట్లే బస్సు హోస్టెస్ ఉంటారు. ఫుడ్ పెడతారు. టీ ఇస్తారు. స్నాక్స్ కూడా ఉంటాయి. జాతీయ రహదారులపైకి ఈ బస్సులు త్వరలో రాబోతున్నాయి. దేశంలో పైలెట్ ప్రాజెక్టు కింద టాటా కంపెనీతో కలిసి కేంద్ర రవాణా శాఖ ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తుంది. మరో ఏడాది, ఏడాదిన్నరలోనే 132 సీట్లతో బస్సులు రోడ్డెక్కబోతున్నట్లు కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
భారతదేశంలో కాలుష్యం తగ్గించడానికి పలు రకాలుగా రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు. లీటర్ పెట్రోల్ ను 120 రూపాయలు చెల్లించే బదులు, 60 శాతం పెట్రోల్, 40 శాతం ఇథనాల్ వినియోగంతో డబ్బు ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. బస్సు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం 40 సీట్ల బస్సు నడపడానికి కిలో మీటర్ కు రూ.115 ఖర్చవుతుందని, ఎలక్ట్రికల్ ఏసీ బస్సు అయితే రూ.41 మాత్రమే ఖర్చవుతుందన్నారు. అదే 132 సీట్ల బస్సును తీసుకురావటం వల్ల ప్రయాణికుడు టికెట్ ఖర్చు 20 శాతం ఆదా అవుతుందని, పొల్యూషన్ తగ్గుతుందని, ప్రభుత్వాలపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు.
విమానం మాదిరగానే ఈ 132 సీట్ల బస్సు ఉంటుందని, ఇందులో బస్సు హోస్టర్స్, ఫుడ్ అన్నీ ఉంటాయని, జాతీయ రహదారుల్లో లాంగ్ జర్నీ కోసం వీటిని తీసుకు రాబోతున్నట్లు వివరించారు. ఈ ఒక్క బస్సులోనే మూడు బస్సుల ప్రయాణికులు హ్యాపీగా జర్నీ చేయొచ్చని, టికెట్ ఖర్చు కూడా 20 శాతం తగ్గుతుందన్నారు. టాటా కంపెనీతో కలిసి నాగపూర్ లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని త్వరలోనే రోడ్డెక్కించనున్నట్లు కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.