Pawan Kalyan : పవన్ నిర్ణయం.. చంద్రబాబు టీం ఫాలో అవుతారా ?
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. పదవిలో ఉండగా తాను జీతం తీసుకోనంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అప్పుల్లో ఉన్న సమయంలో తాను జీతం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన మంత్రుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పవన్ బాటలోనే ఇతర కేబినెట్ మంత్రులు అడుగులు వేస్తారా.. జనసేన మంత్రులు మాత్రమే ఫాలో అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ పని తీరు.. నిర్ణయాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పవన్ కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటాను అన్నారు. ఎందుకంటే ప్రజల సొమ్ము తింటున్నానన్న విషయం ప్రతి క్షణం నాకు గుర్తు ఉంటుంది కాబట్టి తాను పని చేయకపోతే ప్రజలు తనను ప్రశ్నించవచ్చంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మరో విధంగా స్పందించారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ భారీగా అప్పుల్లో కూరుకుపోయిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమయంలో తాను జీతం తీసుకోవడం సరి కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీలో ఉన్న అప్పుల గురించి కొన్నేళ్లుగా చంద్రబాబు, పవన్ ప్రతి సందర్భంలో ప్రజలకు చెబుతూనే ఉన్నారు. గతంలో జగన్ సైతం పదవిలో ఉండగా రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారని పలు సందర్భాల్లో వైసీపీ నేతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్ర అప్పుల గురించి పవన్ పదే పదే ప్రస్తావన చేశారు. ఇక..తాజాగా పవన్ పంచాయతీరాజ్ శాఖ ఆర్ధిక పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన శాఖ ఆర్థిక పరిస్థితి కారణంగా తాను జీతం, భత్యాలు, ఫర్నీచర్ కోసం ఖర్చు చేయటం సరికాదని వాటికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం పైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ నిర్ణయం వ్యక్తిగతంగా ఆమోదయోగ్యమే అయినా..డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయం సహచర మంత్రివర్గం పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు సీఎంగా చంద్రబాబు..లోకేష్ సహా మంత్రులంతా ఇప్పుడు జీతాలు తీసుకుంటూ…పవన్ మాత్రమే తీసుకోకపోవటం రాజకీయంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మరి…మొత్తం మంత్రివర్గం పవన్ బాటలోనే జీతం విషయంలో వ్యవహరిస్తుందా..లేక, తమ అధినేత మార్గంలో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు అడుగులు వేస్తారో చూడాలి.