Mahesh Chandra Ladda : ఏపీ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా నియామకం

Mahesh Chandra Ladda

Mahesh Chandra Ladda

Mahesh Chandra Ladda : ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్డా నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు పాలనా పరంగా ముఖ్య నియామకాలు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాలనలో కీలకమైన నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌చంద్ర లడ్డాను నియమించారు.  లడ్డా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.  అనంతరం, ఆయనను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ఏరి కోరి నిఘా చీఫ్ గా లడ్డాను ఎంపిక చేశారు.

ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్డా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్‌ఐఏలో ఎస్పీగా, డీఐజీగా ఐదేళ్లపాటు పనిచేశారు. విజయవాడ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్ గా, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా, నిఘా విభాగంలో ఐజీగా పనిచేశారు. 2019-20 మధ్య కాలంలో ఏపీ పోలీస్ పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఐజీగా పనిచేసి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. అక్కడ సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్లు పనిచేసిన ఆయన ఇటీవలే ఏపీకి వచ్చారు.

ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్డా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వ్యాన్‌ను మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌లతో పేల్చివేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్డాతో పాటు ఇద్దరు గన్‌మెన్‌లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

TAGS