PM Modi : పార్లమెంట్ లో మోడీ విశ్వరూప ప్రదర్శన.. అవసరమా..?

PM Modi

PM Modi

PM Modi : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో (2024) ఎన్డీయే కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో బీజేపీ ఆందోళన చెందింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిందో ఏమో దూరదృష్టితో బిహార్‌లో నితీష్ కుమార్‌తో పాటు ఏపీలో చంద్రబాబు నాయుడును మళ్లీ కలుపుకుంది. ఆ దూరదృష్టే బీజేపీని కాపాడి ఎన్డీయే అధికారంలోకి వచ్చేలా చేసిందని చెప్పవచ్చు.

జగన్మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కనీసం స్పందించని ప్రధాని మోడీ తమ ప్రభుత్వం మనుగడకు టీడీపీ మద్దతు కోసం ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుపై అదనంగా ప్రేమ వలకబోయడం అందరూ చూశారు. ఇది వరకు కత్తులు దూసిన చేతులతోనే నితీష్ కుమార్‌కు మోడీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.

మహారాష్ట్రలో ఇది వరకు శివసేన, బీజేపీలు మిత్ర పక్షాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండేవి. అలాంటి శివసేనను ఏక్‌నాథ్ షిండే అనే కటప్పతో చీల్చడానికి బీజేపీ వెనకాడలేదు. అలా చీల్చిన ‘కట్టప్ప (శివ)సేన’ కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వం మనుగడకు ఊతం ఇస్తోంది.

ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించలేక మిత్ర పక్షాల మద్దతుతో మనుగడ సాగించవలసి వస్తున్నందుకు మోడీ, అమిత్ షా మొదట్లో బాధపడే ఉంటారు. కానీ అప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుని మళ్లీ విశ్వరూపం చూపడం మొదలుపెట్టారు.

ఆనవాయితీ ప్రకారం లోక్‌సభలో అత్యధిక సీట్లు ఉన్న బీజేపీ లోక్‌సభ స్పీకర్‌ పదవి దక్కుతుంది కనుక ప్రతిపక్షాలు అందుకు అంగీకరిస్తున్నాయి. అదే ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ పదవిని తమకు కేటాయించకపోవడాన్ని అవి తప్పు పడుతున్నాయి.

లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యులుండగా, ఇండియా కూటమికి 233 మంది ఉన్నారు. కనుక డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు మోడీ, అమిత్ షాకు అభ్యంతరం దేనికి? అనే ప్రశ్నకు సమాధానం లేదు.

కానీ మోడీ, అమిత్ షా పంతానికి పోవడం ఇండియా కూటమి కూడా స్పీకర్‌ పదవికి కేరళకు చెందిన కే సురేష్ చేత నామినేషన్స్ వేయించింది. దీంతో ఏడున్నర దశాబ్ధాల్లో నాలుగో సారి స్పీకర్‌ పదవికి పోటీ జరిగింది.

లోక్‌సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి తమ స్పీకర్‌ అభ్యర్థి ఓం బిర్లా అవలీలగా గెలుస్తారు. అయితే ఈ ఎన్నికలో ఇండియా కూటమి ఓడిపోయినా ఆ కూటిమికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు.

ఎన్డీయే కూటమిలో భాగస్వాములే మోడీ తీరును వ్యతిరేకిస్తూ క్రాస్ ఓటింగ్ కు కాల్పడితే? ఇండియా కూటమి అభ్యర్ధి సురేష్ స్పీకర్‌గా ఎన్నికైతే నష్టపోయేది ఎవరు? అని ఆలోచిస్తే ఈ సమస్య తీవ్రత అర్థం అవుతోంది.

ఏకగ్రీవంగా సానుకూల వాతావరణంలో జరగాల్సిన స్పీకర్‌ ఎన్నికలో ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు జరిగేందుకు కారణం మోడీ పంతమే కారణమని చెప్పక తప్పదు.

ఇటువంటి ధోరణితోనే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 300 సీట్లు కూడా రాలేదని, ఇండియా కూటమికి 233 సీట్లు వచ్చాయని వినిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించకపోతే చివరికి నష్టపోయేది ఎన్డీయే కూటమే.

TAGS