India Take Revenge : సెమీ ఫైనల్ పోరులో అన్ని జట్లది సెపరేటు రూటు.. ఇంగ్లండ్ పై ఇండియా ప్రతీకారం తీర్చుకునేనా..
India Take Revenge : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ దశకు చేరుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్ లో టీం ఇండియా ఒకసారి, ఇంగ్లండ్ రెండు సార్లు చాంపియన్ గా నిలవగా.. దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు మొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్ ట్రోపీని అందుకోవాలని తహతహలాడుతున్నాయి. టీ 20 ప్రపంచకప్‌ల్లో సెమీ ఫైనల్ కు చేరడం టీమిండియా కు ఇది అయిదవ సారి కాగా.. కేవలం ఒక్క సారి మాత్రమే కప్ నెగ్గింది. 2007లో ఒకసారి ఛాంపియన్‌గా నిలవగా.. 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గానూ నిలిచింది.
సెమీఫైనల్ చేరిన ఇంగ్లండ్ ఇప్పటికే రెండు సార్లు చాంపియన్ గా నిలిచింది. 2010, 2022 లో టైటిల్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతోంది. ఇంగ్లండ్ జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవ లేదు. ఈ సారి కూడా హాట్ ఫేవరేట్ గా ప్రపంచకప్ లో అడుగిడిన ఇంగ్లండ్ కు భారత్ తో సెమీ ఫైనల్ లో గట్టి పోటీ ఎదురు కానుంది.
ఈ ప్రపంచకప్ లో సంచలనాలకు వేదికగా మారిన అఫ్గాన్ జట్టు మొదటి సారి టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. దీంతో ఆ జట్టుతో పాటు దేశంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి సెమీఫైనల్. ఇంగ్లండ్ జట్టు మాత్రం టీ 20 ప్రపంచకప్ లో నాలుగు సార్లు సెమీస్ కు చేరుకున్న జట్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికా గురించి చెప్పాలంటే, 2014 తర్వాత సెమీ-ఫైనల్ ఆడేందుకు ఇదే మొదటి అవకాశం. ఇప్పటి వరకు ఆడిన గ్రూపు మ్యాచుల్లో చివరి వరకు పోరాడి గెలిచింది.
దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ట్రినిడాడ్ లో జూన్ 27న భారత కాలమానం ప్రకారం.. ఉదయం ఆరు గంటలకే జరగుతుంది. ఇదే రోజు రాత్రి 8 గంటలకు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ గయానాలో జరగనుండగా.. అందరూ తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇంగ్లండ్ ను ఓడించి 2022 సెమీస్ లో ఎదురైన ఓటమికి బదులు ఇవ్వాలని టీం ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.