Minister Atchannaidu : రైతులు ఎరువులు తీసుకున్నప్పుడే నగదు చెల్లించాలి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
Agriculture Minister Atchannaidu : రైతుల ఎరువులు తీసుకున్నప్పుడే నగదు చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు (మంగళవారం) వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో విజయవాడ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ముందుగా నగదు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎరువులు తీసుకున్నప్పుడే నగదు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. తక్షణమే ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు చేసేందుకు భూసార పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నమూనాలు సేకరించి ఫలితాలు తక్షణమే విడుదల చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏడాదికి కూడా భూసార పరీక్షల ఫలితాలు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
అన్ని రకాల విత్తనాలు రాయితీపై అందించేందుకు సమాయత్తం కావాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
గడిచిన ఐదేళ్లలో ఒక్క రైతుకు కూడా వ్యక్తిగతంగా రాయితీలో యంత్ర పరికరాలు అందించలేదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో రాయితీలో గ్రూప్ లకు అందించిన ట్రాక్టర్లలో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని, ఆ అక్రమాల సంగతి తేల్చాలని అధికారులకు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగా రైతులకు యంత్ర పరికరాలు రాయితీలో అందించేందుకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. భవనాలకు రంగులు మార్చే వృథా ఖర్చులు చేయవద్దని మంత్రి సూచించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వృథా ఖర్చు మన ప్రభుత్వంలో చేయవద్దని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.