Variety Thief : వెరైటీ దొంగ ఫోన్లు కొట్టేస్తాడు.. ఫొటోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు..

Variety Thief

Variety Thief

Variety Thief : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఇల్లెందులో ఓ విచిత్ర దొంగ తెరపైకి వచ్చాడు. ఈ దొంగ దొంగతనానికి వెళ్లిన ఇళ్లలో డబ్బులు ముట్టడం లేదు. బంగారాన్ని కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అతడి టార్గెట్ కేవలం మొబైల్ ఫోన్లే.  జల్సాలకు డబ్బులు లేకపోవడంతో కొత్త పంథాలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఈ విచిత్ర దొంగ.  విశేషం ఏంటంటే అందరూ ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇంటిలో దొంగతనం చేస్తాడు.సింగరేణి కార్మిక కుటుంబాలు నివసించే ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీని  టార్గెట్ గా పెట్టుకుని స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

దొంగ రోజూ కార్మికులు నివసించే కాలనీల్లో సంచరిస్తూ ఏ ఇంటికి తాళం వేసి ఉంది? ఏ ఇంట్లో వారు తలుపులు తెరిచి పడుకుంటున్నారు? ఏ ఇంట్లో కార్మికులు విధులకు వెళ్లారు ? అనేది తెలుసుకునేందుకు రెక్కీ నిర్వహిస్తాడు. అదును చూసి చోరీ చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన స్థానిక సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన యువకుడే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కార్మిక కుటుంబాలు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలో సీసీ కెమెరా వీడియోల్లో చూసిన వ్యక్తి, కార్మిక వాడలో ఉండే వ్యక్తి ఒకే పోలికతో ఉన్నారని గతంలో ఫిర్యాదు చేసిన బాధితులు తెలిపారు. ఇంత జరుగుతున్నా అటు సింగరేణి సెక్యూరిటీ అధికారులు, పోలీసులు స్పందించడం లేదు.

స్థానిక జేకే కాలనీలో ఎమ్మెల్యే, అధికారుల క్వార్టర్లకు దగ్గర్లోని ఓ కార్మికుని క్వార్టర్‌లో నెల రోజుల క్రితం ఓ మహిళ ఫోన్ దొంగలించాడు. బాధితులు ఆ నంబర్ కు ఫోన్‌ చేస్తే ఎత్తి నీకు ఫోన్ కావాలంటే పోలీసులకు చెప్పొద్దు. చెబితే అందులో ఉన్న మీ వీడియోలను వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. మరుసటి రోజు బాధితులకు ఫోన్‌ చేసి మొబైల్ కావాలంటే రూ.3వేలు తీసుకుని అర్ధరాత్రి కళాంజలి సినిమా థియేటర్‌ వద్దకు రావాలని సూచించారు. ఆ రోజు వెళ్తే రాలేదు. రెండో రోజు ఫోన్‌ చేసి బాధితురాలు ఒక్కరే రావాలని చెప్పాడు. చివరకు ఓ యువకుడికి నైటీ వేయించి మహిళలా పంపించారు. దొంగ రెప్పపాటు వేగంతో రూ.3వేలు తీసుకుని మొబైల్ ఇచ్చి పారిపోయాడు. బాధితులు ప్రారంభంలోనే తమ ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
 

గత మూడ్రోజుల సీఈఆర్‌ క్లబ్‌ సమీపంలోని సింగరేణి కార్మికుడి ఇంట్లో ఫోన్ కొట్టేశాడు. పౌచ్‌లో ఏటీఎం, ఆధార్‌ ఉండడంతో మరుసటి రోజు ఎవరి కంటపడకుండా ఆ రెండింటినీ ఆ కార్మికుడి ఇంట్లో పడేసి ఇంటి గోడపై ‘ఓన్లీ వాట్సప్‌ కాల్‌’ అని ఫోన్‌ నంబర్‌ రాసి వెళ్లిపోయాడు. ఈ విషయమై కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ దొంగతనాలు మా దృష్టికి వచ్చాయని.. చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

TAGS