India Vs Australia : భారత్ ఆసీస్ మ్యాచ్ లో వర్షం పడితే.. ఏ జట్టుకు లాభం..
India Vs Australia : టీ 20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ లో సూపర్ 8 లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ సెమీఫైనల్ కు దగ్గరైంది. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ పై గెలిచిన ఇండియా నాలుగు పాయింట్లతో సూపర్ 8 కు చేరువైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో సూపర్ 8 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మ్యాచ్ జరిగే సెయింట్ లూసియాలో ఈ రోజు ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా 55 శాతం ఉన్నట్లు అంచనా. ఇక్కడ వర్షం పడకపోతే దాదాపు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది.
సూపర్ 8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, భారత్ లకు ఇదే చివరి మ్యాచ్ కానుండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ 5 పాయింట్లతో సెమీఫైనల్‌కు సాఫీగా వెళ్లిపోతుంది. కానీ మ్యాచ్ రద్దయితే మాత్రం ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు. బంగ్లాదేశ్ పై గెలిచిన ఆసీస్ కేవలం రెండు పాయింట్లతో ఉంది.
మ్యాచ్ రద్దయితే మూడు పాయింట్లు అవుతాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ ల మధ్య మ్యాచ్ పై ఆసీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్ గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకుంటుంది. కానీ అఫ్గానిస్తాన్ గెలిస్తే సెమీస్ కు నేరుగా అఫ్గాన్ చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్ లో ఓడిన ఆసీస్ సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అఫ్గాన్ ఆస్ట్రేలియాపై గెలిచి సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. బంగ్లాదేశ్ ను ఓడిస్తే గనక అఫ్గాన్ కచ్చితంగా సెమీస్ చేరడం ఖాయం. ఇలాంటి సమయంలో బంగ్లాను అఫ్గాన్ ప్లేయర్లు ఓడించడం అంతా పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
ఒక వేళ అఫ్గాన్ పై బంగ్లా గెలిచి, ఆస్ట్రేలియాపై ఇండియా గెలిస్తే మూడు టీంలు ఒక్కో మ్యాచ్ గెలిచినట్లు అవుతుంది. ఇండియా మాత్రమే మూడు మ్యాచులు గెలిచి నేరుగా సెమీస్ కు చేరుకుంటుండగా.. మిగతా మూడు టీంలు ఒక్కో మ్యాచ్ గెలిచి నెట్ రన్ రేట్ మీదే ఆధారపడి సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరిని విజయం వరిస్తుందో ఏ టీం సెమీస్ బెర్త్ దక్కించుకుంటుందో చూడాలి.