Assam CM : మణిపూర్ వాసులకు మానవతా సాయం: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ
Assam CM : మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని అస్సాంలో ఆశ్రయం పొందుతున్న వారికి మానవతా సాయం అందజేయాలని సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. మణిపూర్ లోని జిరిబామ్ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని 1700 మంది అస్సాంలోని కాచర్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం మణిపూర్ నిర్వాసితులకు కావలసిన సాయం అందించాలని సూచించారు.
కాచర్ జిల్లా కమీషనర్ రోహన్ కుమార్ ఝా మరియు పోలీసు సూపరింటెండెంట్ సుమల్ మహట్టాతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డేరెక్టర్ జనరల్ (డీజీపీ), ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గత ఏడాది మే నెలలో మణిపూర్ లోని కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 225 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ సహాయ కేంద్రాలలో తలదాచుకుంటున్నారు.