TTD : ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు: టీటీడీ
TTD News : శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. టీటీడీ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించ వద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
‘‘కొన్ని వాట్సాప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చని కొంతమంది ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం ప్రచారమవుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్ సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా టూరిజం శాఖ ద్వారా కూడా టికెట్లు పొందే సౌకర్యం ఉంది. టూరిజం ద్వారా రావాలనుకునే భక్తులు, దళారీల ద్వారా కాకుండా నేరుగా ఆయా రాష్ట్ర టూరిజం వెబ్ సైట్ ల ద్వారా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. ఈ విషయంలో భక్తులను మోసం చేస్తున్న దళారులపై విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపారు.