Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం సమీపంలో తుపాకీ పేలుడు.. జవాన్ మృతి
Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర పరిసరాల్లో భద్రతా దళానికి చెందిన ఓ జవాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ఈరోజు (బుధవారం) ఉదయం జరిగింది. రామమందిరం యొక్క ప్రధాన భాగం నుండి దాదాపు 150 మీటర్ల దూరంలో కోటేశ్వరాలయం ముందున్న వీఐపీ గేట్ దగ్గర జవాన్ శతృఘ్న విశ్వకర్మ నిలబడ్డారు. సంఘటనా సమయంలో అతనితోపాటు పలువురు భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. బుల్లెట్ విశ్వకర్మ నుదిటికి తగిలిన క్షణాల్లో నేలకొరిగాడు. సహచరులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ జవాన్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
జవాన్ మృతితో ఆలయ ప్రాంగణంలో కలకలం రేగింది. ఘటనా స్థలానికి ఐజీ, ఎస్పీలు చేరుకొని పరిశీలించారు. ఫొరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం తేలనుంది.
శతృఘ్న విశ్వకర్మ స్వస్థలం అంబేద్కర్ నగర్ లోని సమ్మన్ పూర్ లోని కాజ్ పురా గ్రామం. ఆయన 2019లో యుూపీఎస్ఎస్ఎఫ్ లో చేరాడు. మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు