Karimnagar : చీరలు అడ్డుపెట్టి నిండు చూలాలికి పురుడు.. ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసలు..

Karimnagar

Karimnagar RTC Bus stop

Karimnagar : పక్కోనికి ఏమైతే నాకేంటి అనుకునే కాలంలో కూడా ఎక్కడో ఒక చోట అందరూ మనవారే అనుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఉంటున్నారు కాబట్టే కనీసం నాలుగు వానలు పడుతున్నాయని పెద్దలు చెప్తుంటారు. రోడ్డుపై యాక్సిడెంట్ అయితే చాలు మన మీదకు వస్తుందని భయపడుతూ పక్క నుంచి చూస్తూ వెళ్లిపోయే రోజులు ఇవి. కనీసం నోటి సాయం (అంబులెన్స్ కు కాల్ చేయడమో) చేయని వారు కొందరుంటే దగ్గరుండి అంబులెన్స్ లో హాస్పిటల్ కు పంపించే వారు మరికొందరు ఉంటారు. నొప్పులతో బాధపడుతున్న మహిళకు బస్టాండ్ లో పురుడు పోశారు ఆర్టీసీ మహిళా ఉద్యోగులు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.

కరీంనగర్ స్టేషన్ మేనేజర్ రజనీ కృష్ణ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన వలస కూలీ దూల-కుమారి దంపతులు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. కుమారి నిండు గర్భణి. ఆదివారం సాయంత్రం జమ్మికుంట వెళ్లేందుకుగాను కరీంనగర్‌‌ బస్టాండ్‌కు వచ్చారు. అక్కడికి రాగానే నిండు చూలాలైన కుమారికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

ఆమె భర్త దూల ఆమెను పక్కన పడుకోబెట్టి.. తన భార్యకు నొప్పులు వస్తున్నాయని సాయం చేయాలని ఆర్టీసీ సిబ్బందిని వేడుకున్నాడు. వెంటనే వారు 108కి సమాచారం అందించారు. ఈ లోగా నొప్పులు ఎక్కువవడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్ వైజర్లు ముందుకు వచ్చారు. అంబులెన్స్ వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని గ్రహించి చీరలను అడ్డుపెట్టి పురుడు (డెలివరీ) పోశారు. కుమారికి పండంటి ఆడపిల్ల పుట్టింది. కొద్ది సేపటికి 108 రావడంతో తల్లీ, బిడ్డను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బందికి దూల-కుమారితో పాటు నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.

TAGS