Ex CM Jagan : సొమ్ము జనాలది సోకు జగన్ ది.. ప్రజాధనంతో జల్సాలు

Ex CM Jagan

Ex CM Jagan

Ex CM Jagan : గతంలో సీఎం క్యాంపు ఆఫీసు, ప్రస్తుత వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లే రోడ్డు పైకి సామాన్యులను అనుమతించకపోవడం పెద్ద దుమారం రేపుతోంది. ప్రజా డబ్బులతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును.. ప్రైవేటు రోడ్డుగా మార్చుకోవడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. గడచిన ఐదేళ్లుగా ఈ రోడ్డును సీఎం క్యాంపు ఆఫీసు కోసం మాత్రమే వినియోగించారు. ఇతరులెవరికీ ప్రవేశం లేకుండా నిషేధం విధించారు. జగన్‌ సీఎం పోస్టు పోగానే క్యాంపు ఆఫీసును వైసీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చారు.  ఐనా, ఆ మార్గంలోకి ఎవరినీ అనుమతించకవడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ నుంచి రేవేంద్రపాడు వరకూ.. డబుల్ లేన్ రోడ్డు కోసం అప్పట్లో  రూ.ఐదు కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, ఆ నిధులతో జగన్‌ క్యాంపు ఆఫీసు పరిధిలో ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. అప్పట్లో భద్రతాసిబ్బంది ఆ రోడ్డుపైకి ఎవరినీ వెళ్లేందుకు అనుమతించలేదు. ఇప్పుడు జగన్‌ సీఎం హోదాలో లేకపోయినా.. ఆ రోడ్డుపైకి ప్రజలనెవరినీ ఆయన భద్రతా సిబ్బంది అనుమతించటం లేదు.  దీంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం ఈ విషయంపై విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే  జగన్ రాజకీయం చేస్తున్నారు. అప్పటి సీఎం క్యాంపు ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చుకున్న జగన్, అందులోనే రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను కేటాయించి.. కోట్లాది రూపాయల ఫర్నిచర్, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ప్రస్తుతం.. దాన్ని పార్టీ అవసరాల కోసం వినియోగించడంపై జోరుగా విమర్శలు వస్తున్నాయి. సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం ఏయే పనులు చేయించారు. ఎంత ప్రభుత్వ ధనం ఖర్చు చేయించారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై దాదాపు 20 అడుగుల ఎత్తున నిర్మించిన ఇనుప ఫెన్సింగ్ కోసమే రూ.కోట్ల మేర ప్రజాధనం ఖర్చు చేశారు. సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ ల ఏర్పాటుకు దాదాపు రూ.3.63కోట్ల మేర ఖజానా నుంచి ఖర్చుచేశారు.

గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అప్పటి మాజీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై ఫర్నిచర్ దొంగ అంటూ నిందలు మోపి.. తన రాజకీయ జీవితంలో చెరుపుకోలేని ముద్ర వేశారు జగన్. ఆ అవమాన భారం మోయలేక మానసిక క్షోభతో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే  ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు జగన్‌ రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఫర్నిచర్‌ వినియోగించటం పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

TAGS