Ex- Minister Roja : మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు
Ex- Minister Roja : క్రీడల శాఖ మాజీమంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన రూ.100 కోట్ల అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతూ ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశామన్నారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్ డీవోలపై విచారణ జరపాలని కోరామని తెలిపారు. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలని, నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్.బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.