Chandrababu Cabinet : చంద్రబాబు కేబినెట్ లో పిన్న వయస్కులు..పెద్ద వయస్కులు ఎవరంటే..

Chandrababu Cabinet

Chandrababu Cabinet 2024

Chandrababu Cabinet 2024 : తెలుగు తమ్ముళ్లు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథ మహారధుల మధ్య ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా  జరిగింది.  డిప్యూటీ ముఖ్యమంత్రిగా అటు పవన్  ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు ఎవరు, పెద్ద వయసు వారు ఎవరనే చర్చ నడిచింది.

చంద్రబాబు మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్సు గల మంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత. పాయకరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిత వైసీపీ అభ్యర్థిపై 43 వేల 737 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేడు ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 1984 జనవరి 1 తేదీన విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు. అయితే ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఆమె తర్వాత రెండో పిన్న వయస్కుడిగా ఉన్నారు సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్. ఆయన వయస్సు 41 ఏండ్లు. ఆయన తర్వాత కొంచెం పెద్ద వయస్కులు కొండపల్లి శ్రీనివాస్(42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి(42) ఉన్నారు.

Minister vangalapudi Anitha

Minister vangalapudi Anitha

చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న అతిపిన్న వయస్కురాలిగా  రికార్డు సృష్టించిన వంగలపూడి అనిత రాజకీయ నేపథ్యం ఒకసారి చూద్దాం.. ఎంబీఏ పూర్తి చేసి టీచర్ ఉద్యోగం సాధించింది అనిత.  ఆమె ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉపాధ్యాయురాలిగా ఒకవైపు పాఠాలు చెబుతూనే మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

2018లో ఇక టీటీడీ బోర్డు సభ్యురాలిగా కూడా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2024లో మరోసారి టీడీపీ తరఫున పాయకరావుపేట నుంచి బరిలోకి దిగి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు కేబినెట్ లో 70 ఏండ్లు దాటిన వారిలో ఎన్ఎండీ ఫరూక్(75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి(71) వయస్సు ఉన్నారు. అలాగే 50 నుంచి 70 ఏండ్ల మధ్యలో 15 మంది మంత్రులుగా ఉన్నారు.