Video Viral : బస్సును వెంబడించి మరి దుశ్చర్య..రియాసి ఉగ్రదాడి వీడియో వైరల్
Video Viral : జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో ఆదివారం యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసి 10 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే దాడికి ముందు బస్సును ఓ జీపులో ఉండి ఉగ్రవాదులు వెంబడించిన దృశ్యాలు ఆ రోడ్డులోని ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బస్సు లోయలో పడిన తర్వాత కూడా ఉగ్రవాదులు 20 నిమిషాల పాటు ఆపకుండా కాల్పులు జరిపారని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. ఉగ్రవాదుల దాడి సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నారు. వీరిలో 33 మంది గాయపడ్డారు. ఈ ఘటను చూసి దేశంలోని ప్రతీ ఒక్కరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాగా, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో సహా పలువురు నాయకులు ఉగ్రవాదుల దాడిని విమర్శించారు. యాత్రికుల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడి తర్వాత ఆ ప్రాంతమంతా భద్రతను పెంచారు. రియాసి ఉగ్రదాడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇన్‌స్టాగ్రామ్‌లో.. “జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడితో నేను బాధపడ్డాను. ఈ క్రూరమైన చర్య మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరం.. బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తోంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.”
ఈ దాడి గురించి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ఉగ్రదాడిని ఖండించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారి కుటుంబాలకు సాధ్యమైంత వరకు సహాయసహకారాలు అందేలా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ట్వీట్ చేశారు. దీంతోపాటు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయని, దాడి వెనుక ఉన్న వారిని విడిచిపెట్టేది లేదంటూ ఎల్‌జీ సిన్హా స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు చర్య వెనుక ఎవరు ఉన్నా కూడా వారికి త్వరలోనే శిక్ష పడుతుందన్నారు.
ఈ దాడి పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమన్నారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామన్నారు. వెంటనే క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తుందని చెప్పారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.