Yadagirigutta : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. దర్శనానికి 2 గంటల సమయం
Yadagirigutta : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియనుండడంతో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, దర్శన, ప్రసాదం క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనం కోసం భక్తులు క్యూకాంప్లెక్స్, క్యూఅైన్లలో గంటల కొద్ది వేచి ఉన్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట పట్టిందని భక్తులు తెలిపారు.
శనివారం భక్తలు నిర్వహించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ. 56,14,368 ల ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ. 20,44,600లు, కొండపైన వాహనాల ప్రవేశానికి రూ. 7 లక్షల ఆదాయం వచ్చింది.
శ్రీలక్ష్మీనారసింహుడి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం వీల్ ఛైర్లను ఏర్పాటు చేసినట్లు ఈవో భాస్కర్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని, తాజాగా వీల్ చైర్లను ఏర్పాటు చేశామన్నారు. కొండపైన ప్రొటోకాల్ ఆఫీస్ వద్ద వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయని, కావలసినవారు అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. దర్శనం అనంతరం వీల్ చైర్లను తిరిగి ఆలయ సిబ్బందికి సరెండర్ చేయాలని తెలిపారు. వీల్ చైర్లు ఉపయోగించుకున్నందుకు ఎలాంటి ఛార్జి ఉండదని వెల్లడించారు.