Chandrababu : రామోజీరావు మృతి తీరని లోటు: చంద్రబాబు
Chandrababu : ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన మృతి రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటనని చంద్రబాబు అన్నారు.
రామోజీరావుతో తన 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకు స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో తాను రామోజీ సూచనలు, సలహాలు తీసుకునేవాడిని గుర్తు చేసుకున్నారు. రామోజీ అస్తమయంపై ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.