YSRCP : ఇలాగైతే వైసీపీ మనుగడ కష్టమే.. ఆవేదనలో సొంత పార్టీ నాయకులు

YCP

YCP

YCP : ఇటీవల జరిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఊహించని ఘోర ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకుంది. దీనిని ఆ పార్టీకి చెందిన నాయకులు వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గౌరవ‌ప్రదంగా ఓడిపోతే పార్టీ శ్రేణులు ఇంతలా కుంగిపోయేవి కావు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కూడా దక్కని విధంగా అత్యల్పంగా 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైసీపీ ద‌క్కించుకుంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు నాలుగు ఎంపీ స్థానాలలో గెలవడం వైసీపీకి కాస్త సంతోషాన్ని దక్కించే విషయం.  అసలు ఈ ఘోర ప‌రాజ‌యానికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై మరోసారి విశ్లేషణ చేయాల్సిన సమయం వైఎస్ జ‌గ‌న్‌ కి, ఆ పార్టీ నాయ‌కుల‌కు వ‌చ్చింది.  ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై విశ్లేష‌ణ‌లు చేసుకుని, భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై కీల‌క నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం ఇదే. అది వదిలి ఓట‌మికి ప్రధానంగా ఈవీఎంల ట్యాంప‌రింగ్ కార‌ణ‌మ‌ని నమ్మడం దానినే జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం చూస్తే అసలు భవిష్యతులో పార్టీ బ‌తికి బ‌ట్ట క‌డుతుందా అన్న అనుమానాన్ని సొంత పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు.

ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోతే వారి ఓట‌మిని మొద‌ట హుందాగా అంగీక‌రించాలి. ఐదేళ్ల పాల‌న‌లో తాము తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఎందుకింత వ్యతిరేకత ఏర్పడిందో తెలుసుకోవాలి. అన్ని వ‌ర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారడానికి దారి తీసిన పరిస్థితులను జ‌గ‌న్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. అప్పుడు మాత్రమే తప్పులను సరిదిద్దుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.  అలా కాకుండా ఘోర ప‌రాజ‌యానికి ఈవీఎంల ట్యాంప‌రింగే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న పార్టీ నాయ‌కులు న‌మ్మి, వింత వాద‌న చేస్తే… ఇక ఆ పార్టీని దేవుడు కూడా ర‌క్షించ‌లేడు. ఐదేళ్ల పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో నిబ‌ద్ధతను పక్కన పెడితే.. కొన్ని విష‌యాల్లో చేయ‌కూడ‌ని ఘోరాల‌న్నీ ఈ పార్టీ నాయకులు చేశారనేది నమ్మాల్సిన నిజం.  అధికారం చేతిలో ఉంది కదా అని తాము చేసిందే చ‌ట్టం అన్న రీతిలో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోయారు.  అలాంటి వాటిని స‌మీక్షించుకోవాలి. దూర‌మైన వ‌ర్గాల‌ను దగ్గరకు చేసుకునేందుకు ఏం చేయాలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలి.

కొత్తగా ఏర్పాటు కాబోతున్న కూట‌మి ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చి  ఆ త‌ర్వాత హామీల‌ను నిల‌బెట్టుకోక‌పోతే నిల‌దీసేందుకు రెడీ కావాలి. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు సర్వ సాధారణం. అయితే రాజ‌కీయాల్ని రాజ‌కీయంగా కాకుండా, శ‌త్రు భావ‌న‌తో చేసి తప్పు చేసింది వైసీపి. ఇప్పుడు అదే పంథాను టీడీపీ అనుస‌రిస్తోంది. వైసీపీ చేసిన మొద‌టి త‌ప్పు ఇదే అని ఆ పార్టీ మొద‌ట గుర్తించాలి. రాజ‌కీయాల్లో ఏదీ స్థిరంగా వుండ‌దు. ప్రజల మనసులను గెలుచుకున్న వాడే రాజు.

TAGS