Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా నైరుతి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పూర్తిగా వ్యాపించే అవకాశం ఉంది . దీంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించడంతో తిరుపతిలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8.82 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతం నుంచి మేఘాలు ఏపీ, తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. శుక్రవారం వికారాబాద్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని, పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఆవహించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని వివరిస్తున్నారు. హైదరాబాద్ లో నిన్న (బుధవారం), ఈరోజు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.