BJP : ఆ పార్టీల డిమాండ్లను బీజేపీ నెరవేర్చగలదా?
BJP : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 292 సీట్లతో ఎన్డీయే, 234 సీట్లతో ఇండీ కూటములు నిలిచాయి. ఇంకా రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతుంది. ఈ రోజు (జూన్ 5) సాయంత్రం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఎన్డీయే మిత్రపక్షాలు తమ కోరికలపై ఎన్డీయేపై ఒత్తిడి పెంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మూడు కేబినేట్ స్థానాలు కావాలని జేడీయూ డిమాండ్ చేస్తుందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఇదే కాకుండా, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే కూడా ఒక మంత్రి, 2 MOS కావాలని అడుగనున్నారట. ఇది కాకుండా, చిరాగ్ పాశ్వాన్ ఒక క్యాబినెట్ మినిస్టర్, రాష్ట్ర మంత్రిని డిమాండ్ చేయవచ్చు. జితన్ రామ్ మాఝీ కూడా మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి కావాలనుకుంటున్నారు.
టీడీపీతో పాటు ఇతర మిత్రపక్షాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ అడుగుతుందని తెలుస్తోంది. చంద్రబాబు 5 నుంచి 6 కేంద్ర పోస్టులు కావాలని అడగవచ్చని చెబుతున్నారు.
టీడీపీ డిమాండ్ చేసేవి..
1. లోక్ సభ స్పీకర్ పదవి
2. రోడ్డు రవాణా శాఖ మంత్రి
3. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
4. ఆరోగ్య శాఖ మంత్రి
5. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి
6. వ్యవసాయ శాఖ మంత్రి
7. నీటి శక్తి శాఖ మంత్రి
8. సమాచారం మరియు ప్రసార శాఖ మంత్రి
9. విద్యాశాఖ మంత్రి
10. ఆర్థిక (MoS) మంత్రి కావాలని అడగవచ్చు.
ఎన్డీయేకు మెజారిటీ వచ్చింది
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 292 స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష ఇండికూటమి 234 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 272కు 32 సీట్లు తక్కువగా ఉన్నాయి. 2019లో 52 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ 47 సీట్లు అదనంగా గెలుచుకొని 99 సీట్లకు చేరుకుంది. ఎన్డీయే ఓట్ల శాతం కూడా ఈసారి తగ్గినట్లు తెలుస్తోంది.
ఎన్డీయేలోని 5 పెద్ద మిత్రపక్షాలు
నెంబర్ పార్టీ సీట్లు
1. టీడీపీ 16
2. జేడీయూ 12
3. శివసేన 7
4. LJP (రామ్ విలాస్) 5
5. జేడీఎస్ 2
ప్రత్యేక హోదా అడగనున్న బాబు
మంత్రివర్గంలో ఈ డిమాండ్లే కాకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్) కూడా అడగవచ్చు. తెలంగాణ విడిపోయినప్పటి నుంచి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని చంద్రబాబు వాదిస్తున్నాడు.