Silent Votes : ఎగ్జిట్ పోల్స్ ‘సైలెంట్ ఓట్‘ను అంచనా వేయగలవా?
Silent Votes : జూన్ 1న పోలింగ్ ముగిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ కు ఇంకా ఈ ఒక్కరోజే సమయం ఉందన్నమాట. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రజల మూడ్ ఈ రోజు తెలియబోతుంది. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
ఎగ్జిట్ పోల్స్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఓటు వేశారో తెలుస్తుందని విశ్లేషకులు అనుకుంటున్నారు. 2019లో మెజారిటీ సర్వే ఏజెన్సీలు వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపుగా అంచనా వేయగలిగారు. కానీ వేవ్ ను మాత్రం అంచనా వేయడంలో విఫలం అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో మరో అంశం కీలక పాత్ర పోషించనుంది అదే ‘సైలెంట్ ఓటు’. అసలు సైలెంట్ ఓటు ఎటువైపునకు షిఫ్ట్ అయ్యిందనేది ఏపీ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు తీసుకువస్తున్నాయి.
సైలెంట్ ఓటు టీడీపీ, దాని మిత్రపక్షాలైన మహా కూటమికే పడిందని వైయస్సార్ కాంగ్రెస్ చెబుతోంది. మెజారిటీలో ఉన్న సైలెంట్ ఓటు (ప్రధానంగా మహిళల ఓటు) కూటమినే కుర్చీ ఎక్కిస్తుందని టీడీపీ చెప్తోంది. సైలెంట్ ఓటు మొత్తం కూటమికే పడిందని, బాహాటంగా చెప్తే జగన్ అధికారంలోకి వస్తే సైలెంట్ ఓటుపై వేటు వేసే ప్రమాదం ఉందని, వారికి ప్రభుత్వం పరంగా దక్కాల్సినవి దక్కకుండా చేస్తాడని భయంతోనే చెప్పేందుకు జంకుతున్నారని టీడీపీ వాదిస్తోంది.
మైక్రో మేనేజ్‌మెంట్ కు వలంటీర్లు భయపడుతున్నారని టీడీపీ చెబుతోంది. సైలెంట్ ఓటు ఎటువైపు వెళ్లిందనేదానిపై సర్వే ఏజెన్సీలు ఎలా అంచనా వేస్తాయో వేచి చూడాలి. కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా పోటీ తీవ్రంగా ఉంటే డబ్బు, అధికారం, కులం, ఉచితాలు, సోషల్ ఇంజినీరింగ్ వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో వివిధ ఏజెన్సీలకు సర్వే అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈసీఐ నిబంధనలు ముగిసిన తర్వాత రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.