Telangana : తెలంగాణలో రూ. 200 కోట్ల కుంభకోణం..
Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కూడా పూర్తికాక ముందే భారీ కుంభకోణం బయటపడింది. దీంతో అటు గత ప్రభుత్వ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ కుంభకోణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెప్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం మీరే కారణం అంటూ ఆరోపిస్తుంది. ఈ రెండు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెడితే.. రూ. 200 కోట్ల స్కాంపై మాత్రం తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఇమ్మిడి సోమనర్సయ్య ఈ భారీ కుంభకోణానికి ఆద్యుడని అధికారులు తేల్చారు. అసలు ఏం జరిగిందంటే.
సాధారణంగా రైతుల నుంచి సేకరించిన వడ్లను ప్రభుత్వం రైస్ మిల్లులకు తరలించి బియ్యంగా మారుస్తుంది. దీనికి క్వింటాల్ కు ఇంత అంటూ ప్రభుత్వం నుంచి మిల్లర్లు డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇక వడ్లు పట్టించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ దుకాణాలకు తరలిస్తుంటారు. ఈ రేషన్ దుకాణాలకు వెళ్లే బియ్యంను కొందరు రాజకీయ నాయకుల అండదండలతో బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
సూర్యాపేటకు చెందిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య మూడు రైస్ మిల్లుల్లో రూ. 200 కోట్ల బియ్యం మాయం చేసినట్లు వార్తలు తెలంగాణ వ్యా్ప్తంగా వినిపిస్తు్న్నాయి. ఈ స్కాంను ఇటీవల అధికారులు బయటకు తీశారు. దీంతో ఇమ్మిడి సోమనర్సయ్యను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన అధికారులు రిమాండ్ కు తరలించారు. అయితే ఇందులో మరిన్ని వివరాల కోసం పోలీసులు పూర్తి దర్యాప్తు మెుదలు పెట్టారు.