Chandrababu : కూటమి వస్తే బాబుకు సవాళ్లు తప్పవా?

Chandrababu

Chandrababu

Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి  ప్రభుత్వ మార్పు తప్పదనే సంకేతాలు ఇప్పటికే స్పష్టమైంది. ఇక చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి సవాళ్లు తప్పేలా లేవు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే భారీగా నిధులు అవసరం.  ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లోటు లేకుండా చూడడంతో పాటు మరోవైపు అభివృద్ధి పనుల్లో వేగం పెంచడం కూటమి సర్కారుకు అంత సులువు కాదు.

కొత్త ప్రభుత్వం పాలనపై పట్టు బిగించి ఎన్నికల హామీలను కొలిక్కి తీసుకు రావాలంటే  ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రకారం దాదాపు రెండేళ్లు మించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 12లక్షల కోట్ల అప్పు ఉన్నది.  అయితే ఆ అప్పు భారం కొత్త ప్రభుత్వంపైనే పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఓ అప్పు భారాన్ని తగ్గించుకుంటూనే మరో వైపు అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

రాజధానిగా అమరావతిని డెవలప్ చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం చంద్రబాబుకు కత్తి మీద సామే అని చెప్పక తప్పదు. అయితే, ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో చంద్రబాబుకు స్పష్టత ఉందని  టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.  గత ప్రభుత్వం సంపద సృష్టించడంపై దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి.  కానీ, సంపదను ఎలా సృష్టించాలో  చంద్రబాబుకు బాగా తెలుసని, ఆయన అనుభవంతో  సంపదను సృష్టించి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తారని, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచుతారనే  విశ్వాసం కూటమితో పాటు ఏపీ ప్రజల్లోనూ ఉంది.

TAGS