Jr NTR-Kalyan Ram : శక పురుషుడికి ఘనమైన నివాళి.. తాతను స్మరించుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్..
Jr NTR-Kalyan Ram : విశ్వ విఖ్యాత నట సౌర్వ భౌముడు, శక పురుషుడు శ్రీనందమూరి తారక రామారావు జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిర్వహించుకున్నారు. ఆ మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకునేందుకు జయంతి, వర్ధంతి రెండు రోజులు సరిపోవని ప్రముఖులు తమ ప్రసంగాల్లో వివరించారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు విశిష్టతను విదేశాలకు సైతం చాటిన ఘనుడు మన నందమూరి రాముడు అంటూ కీర్తించారు.
ఈ రోజు (మే 28) నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఇలాంటి పురుషుడు శకానికి ఒకరు పుడతారని, మనం ఆయనను చూసే భాగ్యం కలిగిందని ఆనంద పడాలన్నారు. ఇప్పటికీ రాముడు, కృష్ణుడు అంటే మొదలు గుర్తుకు వచ్చే మొహం అన్నగారిదే.
తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అందరి నోట అన్నగారు అని పిలిపించుకున్న ఘనుడు నందమూరి తారక రామారావు అని గుర్తు చేసుకున్నారు. ఆయనను, ఆయన సినిమాలను చూసి పెరిగిన మనం ధన్యులమయ్యామని అన్నారు.
నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ సమాధిపై పూలు చల్లి అంజలి ఘటించారు. తెల్లవారు జామునే ఘాట్ వద్దకు చేరుకొని తాతను స్మరించుకున్నారు.
హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో నందమూరి సంస్మరణ సభలు నిర్వహించనున్నారు. ఆయన కొడుకు బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నేతలు సహా వివిధ పార్టీల ప్రముఖులు ఈ సభల్లో పాల్గొని అన్నగారికి నివాళులర్పించారు.