Rajamouli : ఆ విషయంలో సిరివెన్నెల కోప్పడ్డారు.. శాస్ర్తీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాజమౌళి

Rajamouli

Rajamouli

Rajamouli : ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నార్త్, సౌత్ అనే హద్దులు చెరిపేశారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఒక్క ప్లాఫ్ లేని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళినే. ప్రతి సినిమాకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ  తను అనుకున్న అవుట్ పుట్ వస్తే తప్ప సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడు. సినిమా ఏళ్ల తరబడి వాయిదా పడినా, బడ్జెట్ పెరిగిపోతున్నా తను అనుకున్నది అనుకున్నట్లు వస్తేనే సినిమా బయటికి వస్తుంది. అంతటి పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి.

తెలుగు సినీ సాహిత్యానికి మరింత వన్నెలద్దిన సిరివెన్నెల సీతారామశాస్ర్తితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి.  అలాగే వృత్తిపరమైన విషయాలను వెల్లడించారు. ఈటీవీ లో ప్రసారమవుతున్న ‘నా ఉఛ్వాసం కవనం’  కార్యక్రమంలో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన అన్నయ్య కీరవాణితో పాటు  తనకు పేరు పెట్టింది తమ పెదనాన్నే చెప్పారు రాజమౌళి. ఎంఎం కీరవాణి(మరకతమణి కీరవాణి), ఎస్ఎస్ రాజమౌళి(శ్రీశైల శ్రీ రామౌళి) అరుదైన పేర్లు పెట్టారని చెప్పుకొచ్చారు. అంత గొప్ప పేర్లు పెట్టినందుకు మాకెంతో గర్వంగా ఉంటుందని చెప్పారు. తన కూతరుకు కూడా అలాంటి పేరే పెట్టాలనుకున్నప్పుడు శాస్ర్తి రచించిన సిరివెన్నెల చిత్రంలోని  విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం పాట చరణం నుంచి యయూఖ అనే పదాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు జక్కన్న.

పురస్కారం విషయంలో అలా అన్నారు..
తనకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు తీసుకునేందుకు వెళ్లకూడదనుకున్నట్లు షాకింగ్ విషయం చెప్పారు జక్కన్న. ఆ సమయంలో శాస్ర్తి గారు ఫోన్ చేస్తే వెళ్లడం లేదని చెబితే ఒక్కసారిగా ఆయన కోపంగా తిట్టారని వెల్లడించారు. భారత ప్రభుత్వం నీ సమర్థతను గుర్తించి పురస్కారం ప్రధానం చేస్తుంటే వెళ్లొద్దనే ఆలోచన మంచిది కాదన్నారని,  అతి వేషాలు వేయకుండా వెళ్లి అవార్డు తీసకోవాలని సూచించారని ఆ తర్వాత వెళ్లినట్లు చెప్పారు జక్కన్న.  సిరివెన్నెల అలా మొదటి సారి తనపై కోపాన్ని ప్రదర్శించారని చెప్పారు. 

TAGS