Coaching Centers : కోచింగ్ పేరుతో కోట్లు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లు

Coaching Centers

Coaching Centers

Coaching Centers : దేశంలో అత్యున్నత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్.. వీటిని సాధించేందుకు అభ్యర్థులు తమ జీవితంలో కొన్నేళ్లకు కేటాయిస్తూ ఉంటారు. సివిల్స్ కొట్టిన వ్యక్తిని జనాలు ఓ అద్భుతంలా చూస్తారు. అందుకే సివిల్స్ రాసేందుకు చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ఇక IAS సాధిస్తే అంతకు మించిన విజయం లేదన్న రేంజ్ లో సెలబబ్రేషన్స్ ఉంటాయి.  రిజల్ట్స్ వచ్చిన రెండు మూడు రోజులు  ఏ టీవీ ఛానెల్  పెట్టినా  విజేతలు కథలు, కథనాలు, ఇంటర్వ్యూలే ఉంటాయి. వాళ్లు ఎలా చదివారు.. ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు.. ఎలా సక్సెస్ అయ్యారు. ఇలా ప్రతి ఒక్కరి విజయగాథలను  ప్రతి అక్షరంలోనూ వివరించే ప్రయత్నం చేస్తారు మీడియా వాళ్లు. ఈ ఏడాదికి సివిల్స్ పరీక్షకు అప్లై చేసిన వాళ్లంతా మరో ఆరు రోజుల్లో అంటే మే 26న జరగబోయే ప్రిలిమ్స్ కోసం అకుంఠిత దీక్షతో ప్రిపేర్ అవుతున్నారు .  అయితే ఆ ఒక్క సక్సెస్..  ఆ ఒక్కరి జీవితాల్ని మార్చేయవచ్చు.. కానీ సివిల్స్ కు అప్లై చేసిన లక్షలాది మంది ఫెల్యూర్స్‌ సంగతేంటి..? కేవలం 0.2 శాతం సక్సెస్ రేటును ఆశగా చూపించి లక్షలాది మంది నుంచి రూ.వేల కోట్ల బిజినెస్ నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల మాటేంటి ?  
 
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్‌లో అక్షరాల 1056 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో వికలాంగుల కోసం 40 ఖాళీలను రిజర్వ్ చేశారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య మాత్రం 11 లక్షల పైమాటే. అంటే ప్రతి వెయ్యి మంది అభ్యర్థుల్లో ఎగ్జామ్ లో పోస్టు కొట్టేవారు ఇద్దరే. ఈ పరీక్ష కోసం దేశంలో ఉన్న చిన్న చితకా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు చేసే బిజినెస్ అక్షరాల రూ.3 వేల కోట్లు. హైదరాబాద్‌లో అశోక్ నగర్, ఢిల్లీలో కరోల్ బాగ్, ముఖర్జీనగర్, లక్ష్మీనగర్.. ఈ పేర్లు తెలుగు వాళ్లకు కొత్తేం కాదు. మరీ ముఖ్యంగా సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు రద్దీగా ఉండే ఆ రోడ్లు.. ఎటు చూసినా మిమ్మల్ని కలెక్టర్లను చేస్తామంటూ కనిపించే బోర్డులు..  మా కోచింగ్ సెంటర్లో చేరండి మిమ్మల్ని కలెక్టర్లను చేస్తాం.. 70శాతం డిస్కౌంత్ తో  సీట్లు పరిమితం అంటూ అరచేతుల్లో స్వర్గం చూపిస్తాయి కోచింగ్ సెంటర్లు.  ఒక్క మాటలో చెప్పాలంటే  కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం చేసే జిమ్మిక్కులన్నీ ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు కూడా చేస్తున్నాయి.  
 
గడిచిన పదేళ్లలో యూపీఎస్సీ భర్తీ చేసే పోస్టుల సంఖ్య దాదాపు  అదే. ఉదాహరణకు 2012లో 1091 పోస్టులను భర్తీ చేస్తే 2024 సుమారు 1156 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ అప్పటికీ ఇప్పటీకీ ఆ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థుల సంఖ్య మాత్రం దాదాపు 100 రెట్లు పెరిగింది. 2012లో సుమారు 5 లక్షల మంది పోటీ పడితే ఇప్పుడు సుమారు 10 నుంచి 11 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఢిల్లీ, హైదారాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, సహా ఇతర నగరాల్లో ఏటా ప్రతి కోచింగ్ సెంటర్ సగటున కనీసం 10 నుంచి 15 వేల మందికి కోచింగ్ ఇస్తూ ఉంటాయి. ఢిల్లీలోని పెద్ద పెద్ద పేరున్న కోచింగ్ సెంటర్లయితే ఏటా 20-30 వేల మందికి కూడా కోచింగ్ ఇస్తుంటాయి. కానీ వాళ్ల ఇనిస్టిట్యూట్‌ నుంచి సెలక్టయ్యే అభ్యర్థుల సంఖ్య 10 నుంచి 20 మంది మించి ఉండదు. మరి మిగిలిన వేలాది మంది పరిస్థితి ఏంటి..? అయితే వాళ్ల వైఫల్యాలను పూర్తిగా కప్పెట్టేస్తాయి ఈ సంస్థలు. డబ్బు పెట్టగల్గిన వాళ్లు మళ్లీ మరో ఏడాది కోచింగ్‌లో చేరుతారు.   ఇంకొందరు మాత్రం సివిల్స్ కాకపోయినా వారి వారి స్వరాష్ట్రాల్లో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణులై చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్న వాళ్లు లేకపోలేదు.  అసలు సమస్య ఏంటంటే వాస్తవాన్ని అటు అభ్యర్థులు గుర్తించడం లేదు.. కోచింగ్ సెంటర్లు కూడా అసలు విషయం చెప్పనే చెప్పవు.  
 
 సివిల్స్ లక్ష్యం ఉండటం తప్పు కాదు..  కానీ లక్ష్యం నిర్ధేశించుకునే ముందే వాస్తవ పరిస్థితిపై అభ్యర్థులు ఓ అంచనాకు రావాలి. లక్ష్యం చిన్నప్పటి నుంచే పెట్టుకుంటే అందుకు అనుగుణంగా 8-9 తరగతుల నుంచే ప్లాన్ ప్రకారం చదవాలి. చాలావరు మనం  విజేతల గాథల్నే వింటూ ఉంటాం. కానీ వాళ్లెవ్వరూ ఒక్క ఓటమిని ఎదుర్కొకుండా విజేతగా నిలిచి ఉండరు. నిజానికి సివిల్స్ సుదీర్ఘ ప్రక్రియ, దాని కోసం కేవలం డబ్బులు మాత్రమే కాదు.. ఏళ్ల తరబడి కాలాన్ని కూడా వెచ్చించాలి. ఒక వేళ సెలక్ట్ కాకపోతే.. వాట్ నెక్ట్స్  అంటే ప్లాన్ బి కూడా మీ దగ్గర ఉండాలి. అన్నింటికీ మించీ కోచింగ్ సెంటర్ల మాయాజాలంలో చిక్కుకోకుండా వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూనే అడుగులు ముందుకు వెయ్యాలి.

TAGS