Loksabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికలు.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం
Loksabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది.
ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల్లాంటవే అయినప్పటికీ, ఐదేళ్ల క్రితం అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేథీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్ శర్మను కాంగ్రెస్ బరిలో దించింది. లఖ్ నవూలో హ్యాట్రిక్ గెలుపు కోసం రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.