Mallareddy : భూవివాదం.. పోలీసుల అదుపులో మాజీమంత్రి మల్లారెడ్డి
Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని మల్లారెడ్డి పోలీసులకు చెప్పారు. వేసిన ఫెన్సింగ్ ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పడంతో అనుచరులు భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను నేలకూల్చారు. దీంతో మల్లారెడ్డి, ఇతరులతో పోలీసులు మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వివాదంలో భూమిలో ఘర్షణకు దిగొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు పోలీసులు యత్నించారు.
దీనిపై పోలీసులతో మల్లారెడ్డి పెద్దగా వాగ్వాదానికి దిగారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారని పోలీసులను నిలదీశారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు.
ఇదెలా ఉంటే ఫెన్సింగ్ వేసినవారు పోలీసులకు స్థలంపై స్పష్టతనిచ్చారు. ఒక్కొక్కొరు 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని వివరించారు. కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని కోర్టు ఆర్డర్ ను పోలీసులకు చూపించారు. ఇదే క్రమంలో మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చి వేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలోనే మాజీమంత్రి మల్లారెడ్డిని బషీర్ బాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.