Viral Video : గున్న ఏనుగుకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ.. వైరల్ వీడియో

Viral Video

Elephant Family Viral Video

Viral Video : వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. జంతువుల్లో కూడా బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత ఉంటాయనేది మనకు పక్షులు, జంతువులను చూస్తే తెలుస్తుంటుంది. ఇక అప్పుడే పుట్టిన తమ సంతానానికి అవి ఎంత రక్షణ ఇస్తాయో మనకు తెలిసిందే. అవి సొంతంగా ఆహార సేకరణ చేసే దాక వాటిని జాగ్రత్తగా సాకుతుంటాయి. జంతువులకు సంబంధించిన అరుదైన దృశ్యాలు మనలను ఎంతగానో అలరిస్తాయి.

అలాంటి వీడియోనే ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్ ’ వేదికగా పోస్ట్ చేశారు. అందులో నిద్రపోతున్న ఓ గున్న ఏనుగును క్రూరమృగాల నుంచి కాపాడుకునేందుకు మిగతా ఏనుగులు చేసిన ఓ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ బుజ్జి ఏనుగు చుట్టూ మిగతా పెద్ద ఏనుగులన్నీ రక్షణ వలయంగా ఏర్పడి కునుకు తీస్తున్న దృశ్యం నెట్టింట వైరల్ గా మారింది.

‘‘తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అందమైన ఏనుగు కుటుంబం ఎంతో హాయిగా నిద్రిస్తోంది. చూడండి గున్న ఏనుగుకు ఆ కుటుంబం ఏ విధంగా జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. అలాగే ఓ పెద్ద ఏనుగు కుటుంబ సభ్యుల భద్రతను గమనిస్తూ ఎలా లేచి చుట్టుపక్కల పరిస్థితిని గమనిస్తుందో..అచ్చం మన కుటుంబంలానే ఉంది కదూ..’’ అంటూ ఆమె క్యాప్షన్ రాసుకొచ్చారు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని పంచుకున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జంతువుల్లో కూడా మనుషుల్లాగానే ప్రేమ, ఆప్యాయతలు ఉండడం చూస్తే ముచ్చటేస్తుందని అంటున్నారు. కుటుంబం ఎంత బలాన్ని ఇస్తుందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే గున్న ఏనుగును రక్షించుకునేందుకు ఎలిఫెంట్ బెటాలియన్ కాపలా కాయడం ఆకట్టుకుంటోంది.

TAGS