One Chip Challenge : వేలంవెర్రిగా ‘వన్ చిప్ ఛాలెంజ్’.. ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు
One Chip Challenge : అమెరికాలో వన్ చిప్ ఛాలెంజ్ వేలంవెర్రిగా మారింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని గతంలో చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఛాలెంజ్ లో పాల్గొనదలిచిన వాళ్లు అత్యంత ఘాటైన మిరియాలతో తయారు చేసిన చిప్స్‌ను తినాలి. గతంలో కాలిఫోర్నియాలోని ఓ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు ఇది ట్రై చేశారు. అంత ఘాటైన మసాలతో తయారు చేసి చిప్స్ తినడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్కూలు యాజమాన్యం వారిని ఆస్పత్రికి తరలించింది. చిప్స్ తిన్న విద్యార్థులు మొదట వాంతులు చేసుకున్నారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. తర్వాత మృత్యు వాత పడ్డారు. మరల అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
పాఖీ కంపెనీ విసిరిన ఈ ఛాలెంజ్ లో పాల్గొని 14 ఏళ్ల బాలుడు మరణించాడు. మసాచుసెట్స్‌కు చెందిన హారిస్ వోలోబా.. అధిక మోతాదులో క్యాప్సైసిన్ అనే ఘాటు పదార్థాన్ని తీసుకోవడం వల్లే మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వోలోబా గత ఏడాది సెప్టెంబరులో ఈ ఛాలెంజ్‌లో పాల్గొని.. గుండెపోటుతో మరణించాడు. పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడించింది. ‘‘అధిక ఘాటైన మిరియాలు గల ఆహార పదార్థాన్ని ఇటీవల తీసుకున్న నేపథ్యంలో వోలోబాలో కార్డియోపల్మోనరీ అరెస్ట్‌కు దారితీసింది’’ అంటూ నివేదికలో బాలుడి మృతికి కారణంగా డాక్టర్లు పేర్కొన్నారు. మరోవైపు వోలోబాకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఉందని.. అది కుటుంబ సభ్యులకు తెలియదని వెల్లడించారు. మరణించిన సమయంలో అతడి గుండె ఉబ్బిపోయి ఉందని తెలిపారు.
ఏంటీ వన్ చిప్ ఛాలెంజ్..
పాఖీ కంపెనీ ఈ వన్ చిప్ ఛాలెంజ్ ను సోషల్ మీడియాలో వదిలింది. దీంట్లో పాల్గొనాలనుకునేవారు కంపెనీకి చెందిన ఒక కరోలినా రీపర్ చిప్‌ను తినాలి. తిన్న తర్వాత ఎటువంటి ఆహారం, నీరు తీసుకోవద్దు. దీంట్లో చాలా మంది సెలబ్రిటీలూ పాల్గొనటంతో బాగా పాపులర్ అయింది. ఈ చిప్ తిన్నవారు లైవ్‌లోనే వాంతులు చేసుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఛాలెంజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2023లో వోలోబా మరణం తర్వాత పాఖీ కంపెనీ ఈ ఛాలెంజ్‌ను ఉపసంహరించుకుంది. మార్కెట్ నుంచి చిప్‌లను వెనక్కి రప్పించింది. అత్యంత ఘాటు చిప్‌లను తయారు చేసే కంపెనీగా పాఖీ సంస్థ పేరొందింది. దీన్ని మరింత ప్రమోట్ చేసుకోవడానికి ‘వన్ చిప్ ఛాలెంజ్’కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా మిరపకాయ కారంతో పాటు అత్యంత ఘాటు మసాలాలతో కూడిన చిప్‌ను తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది. ఇది యువకులకు మాత్రమేనని ప్యాకింగ్‌పై స్పష్టంగా పేర్కొంది. చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలని పేర్కొంది.