Ambati Rambabu : ఏపీలో అధికారం మళ్లీ మాదే: అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu : ఏపీలో పోలింగ్ జరిగిన తీరు వైసీపీ విజయానికి సంకేతం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీలో జరిగిన పోలింగ్ తీరు ఆశ్చర్యపర్చిందన్నారు. ఉదయం 7 గంటలకే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం వైసీపీ విజయానికి సంకేతమని చెప్పారు. సీఎం జగన్ ను గెలిపించడానికి మహిళలు, వృద్ధులు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద నిల్చొని ఓటు వేశారన్నారు. వైసీపీ ప్రచారంలో కూడా మహిళలే ముందున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారన్నారు. దీనిని పాజిటివ్ ఓటింగ్ గా భావించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్ జగన్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.

మహిళలకు కల్పించిన సాధికారతకు ప్రతిరూపమే పోలింగ్ శాతం పెరగడమని, అమ్మ ఒడి, ఇళ్లపట్టాలు చేయూత లాంటివి మహిళలకే అందించామని గుర్తుచేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం జగన్ కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైన సంఘటన అన్నారు. సాధారణంగా ఐదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, కానీ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతే లేదని స్పష్టం చేశారు. కేవలం సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు మంత్రి రాంబాబు  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

TAGS