Amit Shah : మోదీ విజయం తథ్యం..: అమిత్ షా – జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్
Amit Shah : జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత భారత దేశ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో మోదీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమిత్ షా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘గతంలో కూడా మార్కెట్ మరింత పడిపోయింది. కాబట్టి మార్కెట్ కదలికలను ఎన్నికలతో ముడిపెట్టడం తెలివైన పనికాదు. బహుశా పతనం కొన్ని పుకార్ల వల్ల కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం, జూన్ 4లోపు కొనండి. మోదీ నేతృత్వంలో మళ్లీ స్థిరమైన ప్రభుత్వం వస్తుమది. ఈ ప్రభావంతో షేర్ మార్కెట్ పెరగబోతోంది’’ అని షా వివరించారు.
ఎన్నికలపై అమిత్ షా మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన మూడు దశల్లో బీజేపీ 190 సీట్లకు పైగా గెలుస్తుందని తెలిపారు. నాల్గవ దశ పోలింగ్ లో కూడా బీజేపీకి అనుకున్న సీట్లు వస్తాయని, తూర్పు భారతదేశంలో బెంగాల్, ఒడిశాలో ప్రాబల్యాన్ని పొందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.