Arvind Kejriwal : ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు’ లక్ష్యంగా మోదీ: అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పీఎం మోదీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతాన్ లాగా మన దేశంలో నియంతగా మారాలని మోదీ కోరుకుంటున్నారన్నారు. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు’ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎవరూ అడ్డురాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులను కటకటాల వెనక్కు నెట్టేందుకు, బీజేపీలోని బడా నాయకుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రణాళికలతో సిద్ధమయ్యారని ఆరోపించారు.
‘‘తాజా ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకెళ్లడం ఖాయం. నాతో సహా ముఖ్యమంత్రులైన మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ వంటి వారందరికీ జైలు తప్పదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మరికొద్ది నెలల్లో పదవీచ్యుతుడిని చేయబోతున్నారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి తనకు 75 ఏళ్లు వచ్చాక రాజకీయ విశ్రాంతి తీసుకోవలసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తన వారసుడిగా తీసుకొచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.