AP Elections 2024 : ఇప్పటిదాక ఒక ఎత్తు..రేపటి నుంచి మరో ఎత్తు..
AP Elections 2024 : ఏపీలో ఎన్నికలకు మరో మూడు రోజులే ఉంది. గత రెండు, మూడు నెలలుగా ప్రచారంలో బిజీబిజీగా ఉన్న రాజకీయ పార్టీలకు రాబోయే మూడు రోజులు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇప్పటిదాక ఒక ఎత్తు..రాబోయే మూడు రోజులు మరో ఎత్తు అనే చెప్పాలి. ఈ మూడు రోజులను ఎవరైతే బాగా ఉపయోగించుకుంటారో, పోల్ మేనేజ్ మెంట్ చేస్తారో వారికే విజయావకాశాలు ఉంటాయి.
ప్రచారం ముందు రోజుల్లో వైసీపీ ఏకపక్షంగా క్లీన్ స్వీప్ చేస్తామనుకున్న దశ నుంచి ప్రస్తుతం టఫ్ ఫైట్ అనే దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైసీపీ, టీడీపీ కూటమి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశాయి. వైసీపీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేసి అధికారంలోకి రావడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టి ప్రయత్నాలే చేశారు. మొదట్లో వైసీపీ మరోసారి అధకారంలోకి రాబోతుందున్న అంచనాలను తలకిందులు చేసి కూటమి అధికారంలోకి రాబోతుంది అన్న అంచనాలకు రావడానికి చంద్రబాబు చాణక్యం బాగా పనిచేసిందనే చెప్పవచ్చు.
జగన్ రెడ్డిని ఒంటరిని చేయడానికి చంద్రబాబు వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడానికి చంద్రబాబు, పవన్ చేసిన ప్రయత్నాలు బలంగానే ఉన్నాయి. తమకు సీట్లు తగ్గించుకుని పెద్ద సాహసమే చేశారు. ఎలాగైనా జగన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా వారు వ్యూహాలు రచించారు. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే వారి ఉమ్మడి లక్ష్యం. చంద్రబాబు, పవన్ చేసిన ఈ ప్రయత్నాల వల్లే నేడు కూటమి మంచి పొజిషన్ లో ఉందనే చెప్పవచ్చు.
అయితే ఇంతటి గట్టిపోటీలో నెగ్గడానికి ఈ మూడు రోజులు మరింత కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ అయ్యారు. ఇలా ఫిక్స్ అయిన వారిని మార్చడానికి పార్టీలకు ఈ మూడు రోజులు బోనస్ అని చెప్పవచ్చు. కూటమికి ఓటు వేయడానికి ఫిక్స్ అయిన ఓటర్లను వైసీపీ వైపునకు తిప్పుకోవడానికి, వైసీపీకి ఓటు వేయడానికి ఫిక్స్ అయిన ఓటర్లను కూటమి వైపునకు తిప్పుకునేందుకు కూటమి నేతలు.. ఇలా వైసీపీ, కూటమి చేసే ప్రయత్నాలే వారి వారి గెలపునకు దోహదం చేయనున్నాయి. ఇక ఒంటరి పోరుతో ఎన్నికలకు వెళ్లడం వైసీపీకి మైనస్ అయితే, ఓట్ల బదలాయింపు సరిగ్గా జరుగుతుందా లేదా అనేది కూటమికి మైనస్ కాబోతుంది. ఈ రెండు ప్రతికూల అంశాలను సరిగ్గా మేనేజ్ చేసిన వారికే విజయం దక్కబోతోంది.