Vote Awareness Song : ‘‘ఓటు వెయ్యాలా..ఓటు అస్త్రాన్ని సంధించాలా..’’ వైరల్ అవుతున్న ఓటు అవగాహన పాట..

Vote Awareness Song

Vote Awareness Song

Vote Awareness Song : దేశమంతా  ఎన్నికల పండుగ కోలాహలం నడుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఓట్ల పండుగను అన్ని దేశాలు గమనిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్ లో నిరక్షరాస్యులు సైతం ఓటును వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. ఏ దేశంలో జరుగనంత వేడుకలా భారత్ లో ఎన్నికలు జరుగుతాయి. మూఢనమ్మకాలు, పురాతన ఆచార వ్యవహారాలు అని విమర్శించే పాశ్చాత్యులు సైతం భారత్ లో జరిగే ఎన్నికల విధానాన్ని కొనియాడుతుంటారు. అయితే చదువుకోని వారు సైతం ఓట్ల పండుగలో పాల్గొంటుంటే..అత్యున్నత చదువులు చదివిన వారు పోలింగ్ డేను హాలీడేగా భావిస్తూ టూర్లు వేస్తుంటారు కానీ ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. పట్టణాల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. తాము ఒక్కరం ఓటు వేయకుంటే కొంపలు మునిగిపోవు అన్న ధోరణి పెరిగిపోతోంది.

ఈ ఎన్నికల్లోనైనా ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏ ఒక్క దానిలో కూడా 65 శాతానికి పైగా ఓటింగ్ జరుగలేదు. వందకు సుమారు 65 మందే ఓటు వేస్తుండడంతో ప్రజాస్వామ్య క్రతువు సరిగ్గా పూర్తికానట్టే అని చెప్పవచ్చు. ఓటు వేసిన వారిలో మెజార్టీ ఓట్లు సాధించిన వారినే విజేతగా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటికే దేశంలో ఓటింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామిక వాదులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు.

తాజాగా ఓటు విలువ, ప్రాధాన్యంపై వచ్చిన ఓ పాట జనాలను అలరిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘‘ఆర్ఆర్ఆర్’’లోని ‘‘కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాల..’’ పాట ట్యూన్ తో ‘‘ఓటు వెయ్యాలా.. ఓటు వెయ్యాలా..చట్టసభల్లో చోటు ఇయ్యాలా..’’ అనే పాట ఆకట్టుకుంటోంది. పాటలో ఓటు విలువను చక్కగా వివరించారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, మంచి నాయకులను ఎన్నుకుని దేశ, రాష్ట్ర భవిష్యత్ ను కాపాడుకోవాలని ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఐదేండ్ల ఒకసారి అందే అస్త్రాన్ని సంధించాలంటూ యువతను మోటివేట్ చేసే విధంగా పాట రాశారు. కాగా, ఈ పాటను విపంచి క్రియేషన్స్ వారు రూపొందించారు. మేఘన టంకాల పాడారు. కొండపల్లి గౌరునాయుడు రచించారు.

TAGS