Viral Video : ఒక్క ఓటే చరిత్రను మార్చేస్తుంది..పోలింగ్ డే అంటే హాలీడే కాదు డిసైడింగ్ డే..
Viral Video : దేశమంతా సార్వత్రిక ఎన్నికల పండుగ కోలాహలం నడుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఓట్ల పండుగను అన్ని దేశాలు గమనిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్ లో నిరక్షరాస్యులు సైతం ఓటును వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. ఏ దేశంలో జరుగనంత వేడుకలా భారత్ లో ఎన్నికలు జరుగుతాయి. మూఢనమ్మకాలు, పురాతన ఆచార వ్యవహారాలు అని విమర్శించే పాశ్చాత్యులు సైతం భారత్ లో జరిగే ఎన్నికల విధానాన్ని కొనియాడుతుంటారు. అయితే చదువుకోని వారు సైతం ఓట్ల పండుగలో పాల్గొంటుంటే..అత్యున్నత చదువులు చదివిన వారు పోలింగ్ డేను హాలీడేగా భావిస్తూ టూర్లు వేస్తుంటారు కానీ ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. పట్టణాల్లో ఓటింగ్ శాతం దారుణంగా పడిపోతోంది. తాము ఒక్కరం ఓటు వేయకుంటే కొంపలు మునిగిపోవు అన్న ధోరణి పెరిగిపోతోంది.
దీన్ని నివారించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామికవాదులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. చదువుకోని వారి కంటే చదువుకున్న వారికే ఈ అవగాహన అవసరం రావడం గమనార్హం. పల్లె ఓటర్లు ఓటు వేయకుంటే తమను తాము చనిపోయినవారుగా భావించి..ఎంత దూరం వెళ్లైనా ఓటు వేస్తారు. అదే పట్టణ ఓటర్లు ఆ రోజు సెలవు దినం కదా అని సినిమాలు, షికార్లకు వెళ్తుంటారు. ఈ ధోరణిలో మార్పు రావడానికి జనాల్లో చైతన్యం తీసుకురావడానికి తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఏముందంటే..
శ్రీకాకుళానికి చెందిన ఓ యువకుడు పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్లకుండా ఆ రోజు ఎంజాయ్ మెంట్ కు ప్లాన్ చేసుకుంటాడు. తన ఒక్క ఓటు వేయకుంటే ఏం కాదులే అన్న ధోరణిలో ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఎదురయ్యే పరిణామాలు ఒక్క ఓటు విలువ ఏంటో అర్థం చేసుకుంటాడు. ఒక్కొక్క నీటి బొట్టు కలిసి మానవ అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో..ఒక్కొక్క ఓటు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఎలా నిలబెడుతుందో తెలుసుకుంటాడు. ఓటు వేయడం మన బాధ్యత అని అవగాహన చేసుకుంటాడు. ఈ ఆసక్తికర వీడియోను మీరు చూడండి.. పోలింగ్ డేను హాలీడే అనుకోవడం మానివేసి దేశ, రాష్ట్ర భవిష్యత్ ను మార్చే డిసైడింగ్ డేగా భావించండి.