Congress Weapon : కాంగ్రెస్ దూకుడు..ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధం..
Congress weapon Anti Government : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతోంది. ప్రచారం కీలక దశకు చేరింది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలపైన కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఫలితాలు అధికారంలో కీలకంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కు కంచుకోటగ ఉన్న ఆ ప్రాంతంలో కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
మారుతున్న లెక్కలు
తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్ని ఉత్తర తెలంగాణ కీలకం. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ బలం ఎక్కువ. 2018 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేయటంతో అధికారం సులువుగా దక్కింది. ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సమీకరణాల్లో మార్పు కనిపించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్దులు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు.
అక్కడ పట్టు కోసం మూడు ప్రధాన పార్టీలో ఫోకస్ చేసాయి. బీజేపీ ఎంపీలపైన అక్కడ వ్యతిరేకత తో పాటుగా బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలచుకొనే వ్యూహాలను అమలు చేస్తోంది. రాహుల్ గాంధీ పర్యటనతో పాటుగా హామీల అమలు పైన పూర్తి స్థాయి ప్రచారంతో మార్పు లు కనిపిస్తున్నాయి.
ఆ స్థానాలు కీలకం :
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అక్కడ రాహుల్, ప్రియాంక బస్సు యాత్ర నిర్వహించారు. 2014లో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ 63 స్థానాలు, 2018 లో 54 స్థానాలు దక్కించుకుంది. దీంతో, అక్కడే బీఆర్ఎస్ ను దెబ్బ తీయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది.
కాంగ్రెస్ 2014 లో ఏడు స్థానాలు, 2018లో 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు అక్కడి పరిస్థితుల్లో భారీ మార్పు కనిపిస్తోంది. తాజాగా సర్వే చేసిన సంస్థలు సైతం ఆసక్తి కర విశ్లేషణలు చేస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల ప్రకటనలతో పాటుగా నేతల తాజా వ్యూహాలు ఉత్తర తెలంగాణలో అనుకూలంగా మారుతున్నట్లు లెక్కలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత ఆయుధం..
ఈ ప్రాంతంలో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదనే ఆగ్రహం కనిపిస్తోంది. డబుల్ బెడ్ రూం ఇండ్లు, వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వకపోవడం, పెరిగిన రైతుల అప్పులు, నిరుద్యోగం వంటి అనేక అంశాలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయి. అదే విధంగా మెజార్టీ ఓటింగ్ వర్గాలుగా ఉన్న బీసీలు, ఎస్సీల్లోనూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.